గుడ్డి పాత్రలమీదే ఎనర్జీ స్టార్ మోజు!

August 27, 2019 at 4:27 pm

మామూలుగా అయితే హీరోలు ఒక స్టార్‌డమ్ ఇమేజి చట్రంలో చిక్కుకుపోయి ఉంటారు. ఆ ఇమేజికి భిన్నంగా తమలోని ఆర్టిస్టును నిరూపించుకునే చిత్రాలు చేయాలని వారికి చాలా కోరిక ఉంటుంది. పెర్ఫార్మెన్స్ పట్టున్న హీరోలు తరచూ అలాంటివి చేస్తుంటారు. కొందరు కేవలం అలాంటి యావతో.. సినిమాలు ఎంచుకుని.. ఫెయిలవుతుంటారు. ఇటీవలికాలంలో తెలుగులో స్టార్ హీరోలు అనేకమంది.. అంగవైకల్యం ఉన్న పాత్రలను ఎంచుకుని.. వరుస సినిమాలు చేశారు. చెవిటి, నత్తి, గుడ్డి, మూగ.. ఇలాంటి పాత్రలను ఎంచుకున్నారు.

అయితే మాంచి ఎనర్జీ ఉండే హీరోగా పేరున్న రవితేజ గుడ్డివాడిగా రాజా దిగ్రేట్ సినిమా చేశాడు. సినిమా రిజల్ట్ సాధారణంగానే ఉన్నప్పటికీ.. రవితేజ పెర్ఫార్మెన్స్ కు పేరొచ్చింది. గుడ్డివాడిగా హీరో పండించిన కామెడీ క్లిక్ అయింది. ఒక సినిమా గుడ్డివాడిగా చేసినప్పటికీ.. మళ్లీ మరో గుడ్డి హీరో పాత్ర కూడా తానే చేస్తానంటూ రవితేజ ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

హిందీలో గత ఏడాది విడుదలైన అంధాధున్ ను తెలుగులో రీమేక్ చేసేందుకు ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సినిమాలో హీరోకు నేషనల్ అవార్డు రావడంతో.. ఇప్పుడు మనవాళ్లందరి దృష్టి దానిపై పడింది. చాలా మంది రీమేక్ హక్కుల కోసం ప్రయత్నిస్తోంటే.. తాను అందులో హీరోగా చేస్తానంటూ రవితేజ ఇంటరెస్ట్ చూపిస్తున్నాడట.

నిజానికి అంధాధున్ వెర్రిమొర్రి కామెడీని పండించే గుడ్డి హీరో చిత్రం కాదు. అది ఒక ఎమోషనల్ థ్రిల్లర్ లాంటిది. అలాంటి సబ్జెక్టు డీల్ చేయడం కత్తిమీద సామే. రవితేజ కామెడీకి ఒక రేంజి ఫాలోయింగ్ ఉంది. కామెడీ పిసరంత లేకుండా.. కేవలం ఎమోషన్ మాత్రం ప్రదర్శించాల్సి వస్తూ.. రవితేజ గుడ్డి హీరో పాత్రను చేస్తే.. జనం ఎలా రిసీ వ్ చేసుకుంటారనే క్లారిటీ లేదు.

అయినా ఒకసారి గుడ్డిపాత్ర చేసిన తర్వాత.. తనకు పెర్ఫార్మెన్స్ మోజుంటే ఇంకా విభిన్నంగా మరో రకం పాత్ర ఎంచుకుంటారు గానీ.. ఈ ఎనర్జీ హీరో.. మళ్లీ గుడ్డిపాత్రకోసం మోజుపడుతున్నాడేమిటా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.

గుడ్డి పాత్రలమీదే ఎనర్జీ స్టార్ మోజు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts