యాక్ష‌న్‌కు “సాహో” రివ్యూ …!

August 30, 2019 at 5:09 am

టైటిల్‌: సాహో
జాన‌ర్‌: యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: సాబు సిరిల్‌
విజువ‌ల్ ఎఫెక్ట్స్‌: క‌మ‌ల్ క‌ణ్ణ‌న్‌
నృత్యాలు: రాజు సుంద‌రం
యాక్ష‌న్‌: కెన్నీ బెట్స్‌, పెంగ్‌జాంగ్‌, బాబ్ బ్రౌన్‌, స్ట‌న్ సిల్వ‌, రామ్‌ల‌క్ష్మ‌ణ్‌, దిలీప్ సుబ్ర‌హ్మ‌ణ్యం, స్టెఫాన్ రిచ్టార్‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ది
నేప‌థ్య సంగీతం: జిబ్రాన్‌
నిర్మాత‌లు: ప‌్ర‌మోద్ – వంశీ
క‌థ‌,ద‌ర్శ‌క‌త్వం: సుజీత్‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 172 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 30 ఆగ‌స్టు, 2019

సాహో.. సాహో.. సాహో అంటూ దేశం మొత్తం సాహో నామ‌స్మ‌ర‌ణ‌తో ఊగిపోతోంది. యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కెరీర్ బాహుబ‌లికి ముందో లెక్క‌…. బాహుబ‌లి త‌ర్వాత ఓ లెక్క అన్న‌ట్టుగా మారిపోయింది. బాహుబ‌లి ఎప్పుడైతే బాలీవుడ్‌ను మించిపోయిందో అప్ప‌టి నుంచి ప్రభాస్ ఇండియ‌న్ స్టార్ అయిపోయాడు. ప్ర‌భాస్ నెక్ట్స్ సినిమా ఎలా ఉంటుందా ? ఎలాంటి క‌థ‌తో వ‌స్తాడు ? అన్న‌ది ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌లేదు. ప్ర‌భాస్ మ‌ళ్లీ అంతే స్థాయిలో బాహుబ‌లిని మించేలా సాహో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. రూ. 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ హైఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గురించి గ‌త ప‌దిహేను రోజులుగా ఇండియ‌న్ మీడియా మొత్తం వార్త‌లు హోరెత్తిస్తోంది. కేవ‌లం ర‌న్ రాజా ర‌న్ సినిమా తీసిన 25 ఏళ్ల కుర్ర డైరెక్ట‌ర్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా భారీ.. భారీ అంచ‌నాల మ‌ధ్య శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. టీజ‌ర్లు, ట్రైల‌ర్లు దుమ్ము రేపేశాయి. మ‌రి ఈ రోజు రిలీజ్ అయిన సాహో భారీ అంచ‌నాలు అందుకుందా ? లేదా ? అన్న‌ది TJ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:
ముంబై నగరంలో రెండు ల‌క్ష‌ల‌ కోట్ల భారీ చోరీ జరుగుతుంది. అదే టైంలో 20 ఏళ్ల తర్వాత దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చిన దుబాయ్ మాఫియా గ్యాంగ్ నేత‌ రాయ్‌ మర్డర్‌కు గురవుతాడు. ఈ రెండు వేల కోట్ల రాబ‌రీ కేసును ఛేదించేందుకు అండర్ కవర్ ఆఫీసర్ అశోక చక్రవర్తి (ప్రభాస్) అపాయింట్ అవుతాడు. ప్రభాస్ టీమ్‌లో స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్‌గా అమృత నాయ‌ర్(శ్రద్ధా కపూర్) కూడా ఉంటుంది. ఈ కేసు ఛేదిస్తున్న క్రమంలోనే అశోక్, అమృత‌ నాయర్ ప్రేమలో పడతారు. ఈ క్రమంలోనే అశోక్ గురించి అమృతకు ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. అయితే ఇంతకూ అశోక్ ఎవరు ? అశోక్‌కు రాయ్‌కు (జాకీష్రాఫ్‌) ఉన్న లింక్ ఏంటి ? మ‌రి అస‌లు సాహో ఎవ‌రు ? చివరకు ఆ మాఫియా గుట్టు ఎవ‌రు రట్టు చేసి అంత‌మొందించారు అన్నదే సాహో కథ.

సాహో విశ్లేష‌ణ :
సాహో కథ నేరుగా దుబాయ్‌లో స్టార్ట్ అవుతుంది. అక్కడ రాయ్‌ సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. ముంబై నుంచి 20 సంవత్సరాల క్రితం పారిపోయిన రాయ్‌ దుబాయ్ మాఫియా సామ్రాజ్యానికి రారాజుగా ఉంటూ వ‌ర‌ల్డ్ మాఫియా లీడ‌ర్ల‌కు సంబంధించిన రెండు ల‌క్ష‌ల‌ కోట్లను తన కంట్రోల్‌లో ఉంచుకుంటాడు. అయితే ఈ గ్యాంగ్‌ను కంట్రోల్ చేసే కుర్చీ కోసం అదే గ్యాంగ్‌లో కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. రాయ్‌ను అదే గ్యాంగ్ లో కుర్చీ కోసం ఎప్పటినుంచో కన్నేసుకుని కూర్చున్న‌ చుంకీ పాండే యాక్సిడెంట్‌లో చంపేస్తాడు. ఈ మాఫియా గ్యాంగ్ దాచుకున్న రెండు లక్షల కోట్లకు సంబంధించి ఓ బ్లాక్ బాక్స్ ముంబై లో ఉండిపోతుంది. క‌థ‌నం చూస్తే సినిమా ప్రారంభమై గంట అవుతున్నా చాలా ఫ్లాట్ గా ముందుకు వెళ్తూ ఉంటుంది. కథలో ఎటువంటి మలుపులు.. ఎలాంటి ట్విస్టులు ఉండదు.

సినిమా విజువల్స్ పరంగా చాలా గ్రాండియర్ లుక్‌లో ఉంటుంది. బాహుబలి లాంటి హిస్టారికల్ మూవీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రభాస్ నటన ఎలా ఉంటుందా ? అని భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలిలో ప్రభాస్ నటనతో సరిపోలిస్తే సాహోలో ప్రభాస్ నటన కాస్త తేలిపోయినట్టే ఉంది. దర్శకుడు సుజిత్ అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపించింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా నడిపించిన దర్శకుడు సుజిత్.. కథను మెయిన్ ట్రాక్‌లోకి ఎక్కించేందుకు చాలా టైం తీసుకున్నాడు. గంట వరకు సో సోగా సాగిన సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు ఒక్కసారిగా పీక్స్‌కు చేరుకుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్‌తో సెకండ్ ఆఫ్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి.

సెకండాఫ్‌లో మాత్రం క‌థ‌ను ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్టుల‌తో ప‌రుగులు పెట్టించాడు. చివ‌రి 35 నిమిషాల యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాగున్నాయి. కథాపరంగా చూస్తే సాహో మరీ అంత గొప్ప కథేం కాదు. రెండు లక్షల కోట్ల నిధికి సంబంధించిన నేపథ్యంలో దుబాయ్‌లో ఉన్న అండర్ వరల్డ్ క్రైమ్ గ్యాంగ్‌ ప్రయత్నాలు చేయడం.. దానిని ఇండియాలో ఉన్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అడ్డుకోవడం… చివ‌ర‌కు ఈ నిధి వెన‌క ఉన్న క‌థ‌… ఇదంతా రొటీన్ తరహాలోనే ఉంటుంది. అయితే సాధార‌ణ క‌థ‌కు అద్భుత‌మైన హంగులు, కొన్ని ట్విస్టులో జోడించ‌డ‌మే సాహోలో హైలెట్‌.

న‌టీన‌టుల విశ్లేష‌ణ :
ప్ర‌భాస్ సినిమా అంతా వ‌న్‌మ్యాన్ షో అయ్యి న‌డిపించాడు. ద‌ర్శ‌కుడు సుజీత్ ప్ర‌భాస్‌ను ఇంకాస్త బాగా వాడుకుని ఉండాల్సింద‌నిపించింది. హీరోయిన్ శ్రద్ధా కపూర్ అమృత నాయర్ పాత్రలో స్పెషల్ క్రైమ్‌ బ్రాంచ్ ఆఫీసర్‌గా నటించింది. శ్రద్ధా కపూర్ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్‌గా నటించడంతో పాటు గ్లామ‌ర్ లుక్‌లోనూ మెప్పించింది. మందిరా బేడీ రాయ్‌ గ్రూప్ లీగల్ అడ్వైజర్‌గా నెగిటివ్ షేడ్లో తన పాత్ర మేరకు నటించింది. మురళీ శర్మ, వెన్నెల కిషోర్ ప్రభాస్ టీమ్‌లో పోలీసులుగా కనిపిస్తే.. ఈ సినిమాలో మాఫియా గ్యాంగ్ విలన్‌లుగా నటించిన చుంకీ పాండే, జాకీ ష్రాఫ్ తదితరులంతా స్టైలిష్ విలన్‌లుగా కనిపించారు. ట్విస్టింగ్ పాత్ర‌లో నీల్‌నితిన్‌, కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ సైతం మెప్పించారు. వీళ్లిద్ద‌రి పాత్ర‌లు ఎవ్వ‌రి ఊహ‌ల‌కు అంద‌వు. ఉన్నంతలో కమెడియన్ వెన్నెల కిషోర్ మాత్రమే ఒకటిరెండు సీన్లలో కామెడీ పండించాడు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ప‌నితీరు :
టెక్నికల్‌గా చూస్తే సినిమాటోగ్రాఫర్ మదికి మంచి మార్కులు పడతాయి. ఈ సినిమా ప్రతి సీన్‌లోనూ చాలా రిచ్ విజువల్స్ చూపించేందుకు మది పడిన కష్టం స్పష్టంగా కనిపిస్తోంది. సంగీతం విషయానికి వస్తే.. సినిమాలో ఆల్బమ్ 13 నిమిషాలే ఉన్నా నాలుగు పాటలు తెరపై ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ ను చాలా నేచురల్‌గా చూపించాడు అంటే అతని కెమెరా పనితనం అర్థమవుతుంది. సినిమాలో పాటలతో పాటు జిబ్రాన్‌ నేపథ్య సంగీతం ప్రతి సీన్‌ను ఎలివేట్ చేసేలా ఉంది.

శ్రీకర్ ప్రసాద్ సీనియర్ ఎడిటింగ్ బాగున్నా.. ఫస్ట్ ఆఫ్‌లో పది నిమిషాల సన్నివేశాలకు కత్తెర వేయాల్సింద‌ని అనిపించింది. ఫస్టాఫ్ స్టార్టింగ్‌లో కొన్ని సాగదీత సన్నివేశాలు కాస్త ఇబ్బంది కలిగించాయి. సినిమాలో యాక్ష‌న్ హైలెట్‌. యువీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్ భారీగా ఖర్చు చేసినట్టు చెప్పారు. ప్రభాస్ కూడా స్వయంగా రూ.350 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పినా.. సాహో ఖ‌ర్చు మరీ అంత ఉంటుందా అన్న సందేహం అయితే రాకమానదు.

సుజీత్ డైరెక్ష‌న్ క‌ట్స్ :
షార్ట్ ఫిలిం స్థాయి నుంచి నేరుగా డైరెక్టర్ అయిపోయిన సుజిత్ `రన్ రాజా రన్` సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. రెండో సినిమానే ఇంత భారీ బడ్జెట్‌తో ఎలా తెరకెక్కిస్తాడ‌ని చాలామందికి ఉన్న సందేహాలను పటాపంచలు చేశాడు. రెండు వేల కోట్ల రాబరీకి సంబంధించిన కథను లైన్‌గా తీసుకున్న సుజిత్ యాక్షన్ ప్రధానంగా తెరకెక్కించిన కథను గ్రిప్పింగ్‌గా చెప్పడంలో కాస్త తడబడిన‌ట్టే కనిపిస్తోంది. సినిమాను ఆద్యంతం స్టైలిష్ గా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిచాల‌న్న‌ తాపత్రయమే సుజిత్‌ లో కనపడింది.
సెకండాఫ్‌లో ఊహించ‌ని ట్విస్టులు ఉన్నా.. తెలుగు నేటివిటి మిస్ అయిన‌ట్టు అనిపించ‌డం… ఎమోష‌న్‌, రొమాంటిక్ ట్రాక్, కామెడీ కంటే యాక్ష‌నే ఎక్కువుగా న‌మ్ముకోవ‌డం మైన‌స్‌.

ఫైన‌ల్‌గా…
ప్ర‌భాస్ న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం సాహో భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను సాహో పూర్తిగా అందుకోలేద‌నే చెప్పాలి. కేవ‌లం యాక్ష‌న్ ప్రియుల‌ను టార్గెట్ చేసేలా ద‌ర్శ‌కుడు సుజీత్ సాహోను తీర్చిదిద్దారు. సినిమాకు కీల‌క‌మైన ఎమోష‌న్‌, రొమాంటిక్‌, కామెడీ ట్రాక్‌లు గొప్ప‌గా లేక‌పోవ‌డంతో యాక్ష‌న్ సాహోను ఏ రేంజ్‌కు తీసుకు వెళుతుందో ? చూడాలి.

సాహో ఫైన‌ల్ పంచ్‌: యాక్ష‌న్‌కు సాహో

సాహో TJ రేటింగ్ : 3.25 / 5

యాక్ష‌న్‌కు “సాహో” రివ్యూ …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts