సైరాను చూస్తే రోమాలు లేచి ఆడాల్సిందే…!

August 20, 2019 at 9:44 pm

మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ వచ్చేసింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్‌తో తెలుగోడి రోమాలు నిక్కబొడుచుకునేలా టీజర్‌ను రూపొందించారు. ‘చరిత్ర స్మరించుకుంటుంది. ఝాన్సీ లక్ష్మీభాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలను. కానీ, ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు..’ అంటూ పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ‘సైరా’ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. ఆంగ్లేయులతో పోరాడిన ఒక తెలుగువాడి వాడీవేడీని టీజర్‌లో అద్భుతంగా చూపించారు.

ఎవరీ నరసింహారెడ్డి అని ఆంగ్లేయుడు ప్రశ్నిస్తే.. ‘సింహంలాంటోడు దొరా.. అతడే వాళ్ల ధైర్యం దొరా..’ అంటూ నరసింహారెడ్డి ధీరత్వం గురించి వర్ణించే డైలాగ్ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ‘వేలాది వీరులారా.. చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ, చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ టీజర్‌కు హైలెట్‌గా నిలుస్తోంది. ‘సైరా నరసింహారెడ్డి’ అంటూ గంభీరమైన వాయిస్‌తో పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్‌తో టీజర్ ముగుస్తుంది.

స్వాతంత్ర సమరయోధుడు, తెలుగువాడైన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై శ్రీమతి సురేఖ సమర్పణలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, నయనతార, కిచ్చా సుదీప్ విజయ్ సేతుపతి, తమన్నా, నిహారిక, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేదీ సంగీతం సమకూరుస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి జన్మదినం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు.

సైరాను చూస్తే రోమాలు లేచి ఆడాల్సిందే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts