బీజేపీకి టీఆర్ఎస్‌ని ఢీకొట్టే బలం ఉందా…!

August 22, 2019 at 10:32 pm

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. గత నెల రోజులుగా ఇతర పార్టీల నాయకులని చేర్చుకుంటూ బలపడాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ని అణగదొక్కేసి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగి తెలంగాణలో పాగా వేయాలని అనుకుంటుంది. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ ని ఢీకొట్టేంత బలం బీజేపీకి ఉందా? అంటే చెప్పలేం, కానీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. లోక్ సభ ఎన్నికల ముందు వరకు బీజేపీకి తెలంగాణలో అంత సీన్ లేదనే చెప్పాలి.

లోక్ సభ ఎన్నికలు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ 119 స్థానాలకి గాను 118 చోట్ల పోటీ చేసి 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి ఒక స్థానంలో గెలుపొందింది. అయితే 2014 నుంచి అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత కూడా టీఆర్ఎస్-బీజేపీ సఖ్యంగానే మెలిగాయి. సీఎం కేసీఆర్..మోడీ-అమిత్ షా లకు స్నేహ హస్తం అందిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడు అయితే లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలవడం, దేశ వ్యాప్తంగా మోడీ గాలి బలంగా వీచి బీజేపీ సొంతంగానే కేంద్రంలో పాగా వేయడంతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి.

తెలంగాణ లో తమకు బలం పెరిగిందని బీజేపీ అంచనాలు పెంచేసుకుంది. పైగా కేంద్రంలో కూడా అధికారంలో ఉండటంతో, తెలంగాణలో బలపడేందుకు ఎత్తుగడలు వేయడం మొదలెట్టింది. ఒకవైపు టీడీపీ, కాంగ్రెస్ నేతలనీ చేర్చుకుంటూనే టీఆర్ఎస్ పైనా కూడా దృష్టి ముందుకు వెళుతుంది. అటు ఉత్తరాదిలా హిందూ కార్డు వాడి లబ్ది పొందాలని అనుకుంటుంది. టీఆర్ఎస్ ఎలాగో ఎం‌ఐ‌ఎం పార్టీతో స్నేహం చేస్తోంది. ఇదే ఆసరాగా చేసుకుని మతం మీద లాభం పొందాలని అనుకుంటుంది. మొత్తానికి టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పే ప్రయత్నం చేస్తోంది.

కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ పార్టీ పూర్తి బలంతో ఉంది. టీఆర్ఎస్ తో పోలిస్తే బీజేపీ బలం చాలా తక్కువే. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్, ఆయా స్థానాల్లో టీఆర్ఎస్ మీద వ్యతిరేకిత వల్లే బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది. ఇక్కడ బీజేపీని చూసి జనాలు ఓటేయలేదు. టీఆర్ఎస్ అభ్యర్థులపై వ్యతిరేకత బీజేపీ అభ్యర్థులకు వరమైంది. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కంటే బీజేపీకి అంత బలమేమి కాదు. ప్రస్తుతానికి బలుపుని చూసి వాపు అనుకుంటుందని అర్ధమవుతుంది. కానీ బీజేపీ బలం తెలియాలంటే రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు బట్టి అర్ధమవుతుంది. చూద్దాం మరి బీజేపీది బలుపో…వాపు.

బీజేపీకి టీఆర్ఎస్‌ని ఢీకొట్టే బలం ఉందా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts