తె-తెదేపా.. కథ ముగిసింది.. కల చెదిరింది

August 19, 2019 at 12:36 pm

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో అనైతిక జట్టు కట్టిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏం బావుకుంది? నిండా ఆరునెలలు తిరిగే సరికి.. ఆ పార్టీ దుకాన్ బంద్ అయింది. మళ్లీ మేం తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాం.. అంటూ బీరాలు పలికిన చంద్రబాబు మాటలు కల్లలయ్యాయి. వారి కలలు చెదిరిపోయాయి. పార్టీ కథ ముగిసింది. సాక్షాత్తూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు.. భాజపాలోకి ఫిరాయించిన గరికపాటి మోహన్ రావు మాటల్లోనే. ‘తెలంగాణ తెదేపాలో ఇప్పుడు ఎవ్వరూ లేరు..’!!

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఖాళీ అయిపోయిందని అర్థం చేసుకోవడానికి ఇవాళ ఆ పార్టీ నుంచి వెళ్లిపోయిన ఒక నాయకుడు చెప్పే స్టేట్ మెంట్ ను చూడాల్సిన అవసరం లేదు. ఆ సంగతి ప్రజలకు ఎప్పటినుంచో తెలుసు. నిజానికి తెలంగాలణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ పార్టీ పనైపోయింది. కానీ.. చంద్రబాబునాయుడు.. నానా పన్నాగాలతో.. చనిపోయిన పార్టీకి ఊపిరులూదాలని చూశారు. ఏ కాంగ్రెసుకు వ్యతిరేకంగా అయితే తెదేపా పుట్టిందో.. అదే కాంగ్రెసు పల్లకీని భుజాన పెట్టుకుని మోశారు. తెలంగాణలో కాంగ్రెసును అధికారంలోకి తీసుకురావడానికి విపరీతంగా ప్రచారం నిర్వహించారు.

పతనం అయిపోయిన పార్టీ తో పాటు ఆయన ఇమేజి కూడా పతనం అయిపోయింది. అంతకు మించి ఆ పార్టీ ఏమీ సాధించలేకపోయింది. పార్లమెంటు ఎన్నికల్లో కూడా నామమాత్రంగా పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికా అన్నట్లుగా కొన్ని శుష్క ప్రయత్నాలు చేశారు. అక్కడ కూడా దెబ్బతిన్నారు. ఇప్పుడు ఏపీలో పనిలేకుండా ఖాళీ అయిపోయిన తర్వాత.. హైదరాబాదులో మకాం పెట్టేసి.. తెలంగాణ పార్టీని ఉద్ధరిస్తా అని మళ్లీ డైలాగులు చెబుతున్నారు.

ఇదంతా పక్కన పెడితే.. చంద్రబాబు ఆప్తుల్లో ఒకరు తెలంగాణ నేత అయినా రాజ్యసభ ఎంపీ అయిన గరికపాటి మోహనరావు తాజాగా భాజపాలో చేరారు. ఈ సందర్భంగా సభలో.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోయిందని ఆయనే స్వయంగా సెలవిచ్చారు. చంద్రబాబు అంటే గౌరవం ఉన్నదంటూనే… విభజన తర్వాత.. ఏపీలో చంద్రబాబు బిజీ అయిపోవడంతో.. తెలంగాణలో పార్టీ గాడితప్పి పతనం అయిపోయిందని చెప్పుకొచ్చారు. మొత్తానికి తెలంగాణలో పార్టీ అంతర్ధానం కావడం బాబు పుణ్యమే అంటున్నారు. మరి ఉద్ధరించదలచుకుటున్న చంద్రబాబుకు అనుచరుడి మాటలు అర్థమౌతాయో లేదో.

తె-తెదేపా.. కథ ముగిసింది.. కల చెదిరింది
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts