మందు బాబులకు గుడ్ అండ్ బాడ్ న్యూస్ !

August 19, 2019 at 12:11 pm

జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చింది. ఇకపై మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించనుంది. దీనికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగులను ఏడాది కాలవ్యవధితో నియమించుకుని.. వారిద్వారా విక్రయాలు సాగిస్తారు. ఈ కొత్త మద్యం విధానం వల్ల మందుబాబులకు ఒకటిరెండు గుడ్ న్యూస్‌లు, ఒకటిరెండు బ్యాడ్ న్యూస్ లు కనిపిస్తున్నాయి.

కొత్త మద్యం విధానం వలన మందుబాబులకు ప్రధానంగా వచ్చే ఇబ్బంది ఏంటంటే.. లిక్కర్ ఎక్కడపడితే అక్కడ దొరకదు. హైవే మీద వెళ్తూ వెళ్తూ.. ఏ దాబాలోనో ఆగి ‘హాఫ్ బాటిల్ పట్రా’ అంటే దొరకదు. మారుమూల పల్లెటూర్లో కూర్చుని… కూల్ డ్రింకు షాపుకో, కిరాణా కొట్టుకో వెళ్లి… నాలుగు బీర్లు తెచ్చుకోవాలంటే సాధ్యం కాదు. బెల్టు షాపులను జగన్ సర్కారు పూర్తిగా కట్టడిచేసేస్తోంది. ఇంత కట్టడి చేసినా కూడా.. ఎక్కడైనా బెల్టుషాపులు నడుస్తోంటే వాటిమీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీచేశారు.

మందుబాబులకు మరొక ఇబ్బంది కూడా ఉంది. ఇన్నాళ్లూ మద్యం అర్ధరాత్రి వరకు దొరుకుతుండేది. ఇకపై అదికూడా కట్ అయినట్టే. ఉదయం పదినుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరగాలని సర్కారు నిర్ణయించింది. రాత్రి 9 తర్వాత షాపులు బందవుతాయి. కేవలం ప్రభుత్వ దుకాణాలే గనుక.. అక్రమంగా అర్ధరాత్రి దాటిన తర్వాత షట్టర్ మూసేసి వెనుక కిటికీలోంచి అమ్మకాలు జరిపే వక్ర వ్యాపారాలు ఉండవు.

అలాగే మందుబాబులకు గుడ్ న్యూస్ కూడా ఉంది. మద్యం వారికి ఇక ఎమ్మార్పీకే దొరకబోతోంది. చాలా సందర్బాల్లో ఎమ్మార్పీ కంటె ఎక్కువ ధరలకు అమ్ముతున్నారంటూ గొడవలు జరిగాయి. ధర్నాలు కూడా జరిగాయి. ప్రభుత్వ దుకాణాల్లో అలాంటి దోపిడీ ఉండదు. అలాగే.. కల్తీ మద్యం అమ్మడం కూడా జరగదు.

మొత్తానికి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అనే దానిని సాకారం చేసేదిశగా ప్రభుత్వం.. సరికొత్తం ఎక్సయిజు పాలసీ తీసుకురావడం అభినందనీయం.

మందు బాబులకు గుడ్ అండ్ బాడ్ న్యూస్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts