ఆ విషయంలో అచ్చంగా రాజన్న స్ఫూర్తి

August 14, 2019 at 4:51 pm

3600 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు.. వైఎస్ జగన్మోహన రెడ్డి.. ఎన్నిరకాల పథకాలను ప్రకటించినా, హామీలను ఇచ్చినా… స్థూలంగా అన్నింటి అంతరార్థం ఒక్కటే. మీ ముందుకు మళ్లీ రాజన్న రాజ్యం ఆవిష్కరిస్తానని ఆయన మాట ఇచ్చారు. ఇప్పుడు కొన్ని విషయాల్లో మాత్రం జగన్మోహన రెడ్డి పాలన రాజన్నను మరపించేలా ఉంది. ఆయన నిర్ణయాల్లో… ఔదార్యంలో అచ్చంగా రాజన్నస్ఫూర్తి కనిపిస్తోందని ప్రజలు హర్షామోదాలు వ్యక్తం చేస్తున్నారు.

వైద్య ఆరోగ్య రంగంపై జగన్మోహన రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆరోగ్యశ్రీ విషయంలో అనేకానేక విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించారు. ఆరోగ్యశ్రీ వర్తించేలాగా కొన్ని కొత్తవ్యాధులను కూడా జాబితాలోకి చేర్చారు. అన్నింటికంటె మించి… అయిదులక్షల ఆదాయం దాటని ప్రతి ఒక్కరికీ కూడా.. ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని జగన్ ప్రకటించడం పెద్ద వరం కింద భావించాలి. అదే విధంగా.. చికిత్స ఖర్చు వెయ్యిరూపాయలు దాటితే చాలు.. ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని అనడం కూడా విశేషమే.

ఇప్పటిదాకా పెద్దపెద్ద రోగాలు వస్తే ఆరోగ్యశ్రీ వర్తిస్తున్నది కానీ, పేరుకు చిన్న రోగాలే అయినా.. వేలల్లో ఖర్చులు లెక్కతేలుతూ, చికిత్స తమ తాహతుకు భరించరానిదిగా ఉన్న నేపథ్యంలో కునారిల్లుతున్న సామాన్యులు అనేకమంది ఉంటున్నారు. అలాంటి వారందరికీ జగన్ చేసిన ఈ కొత్త మార్పు చాలా ఆదుకుంటుందని చెప్పొచ్చు.

అలాగే హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై నగరాల్లో 150 ఆస్పత్రులకు కూడా ఆరోగ్యశ్రీ వచ్చేలా ఆదేశాలు మార్చారు. పొరుగు రాష్ట్రాల్లో చేయించుకునే చికిత్సకు అయిదేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదు. దాంతో.. అక్కడి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏపీ రోగులను చేర్చుకోవడమే మానేశాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రాణాల మీదికి తెచ్చుకున్న వారు అనేకులు.

మొత్తంగా చూసినప్పుడు.. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీలోని నిరుపేదలకు మరింతగా చేరువ చేయడంలో జగన్మోహనరెడ్డి అచ్చంగా రాజన్న స్ఫూర్తిని పుణికిపుచ్చుకుంటూ.. ఎంతో ఔదార్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అప్పట్లో వైఎస్సార్.. స్థూలంగా కేవలం డబ్బులేకపోవడం వల్ల.. సూపర్ స్పెషాలిటీ చికిత్స పొందలేకపోవడం అనే దౌర్భాగ్యం రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఉండకూడదని సంకల్పించారు. ఇప్పుడు ఆ స్ఫూర్తిని మరింత ఘనంగా ఇంప్రొవైజ్ చేసి… జగన్ అమల్లోకి తెస్తున్నారు.

ఆ విషయంలో అచ్చంగా రాజన్న స్ఫూర్తి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts