అన్నాడీఎంకేకు కూడా కమలగండం!

September 5, 2019 at 10:42 am

తమిళనాడులో కూడా తమ అస్తిత్వాన్ని నిరూపించుకుంటూ సీట్లు గెలవగలిగే స్థాయికి బలపడాలనే వ్యూహాన్ని భారతీయ జనా పార్టీ పదును పెడుతోందా? ఇందుకు సంబంధించి ఇతర పార్టీల్లోని వారికి ఎర వేస్తూ.. కమలం గుర్తుపై తమిళనాడులో విజయాలు నమోదు చేసేందుకు కొత్త ప్రణాళికతో ఉన్నదా? అంటే.. తమిళ రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినవస్తోంది. తమిళిసై సౌందరరాజన్ ను తెలంగాణ కొత్త గవర్నర్‌గా నియమించిన నేపథ్యంలో… తమిళనాడులో భాజపా చీఫ్ గా, వలసలను ప్రోత్సహించగల… తద్వారా పార్టీ బలాన్ని పెంచగల నాయకుడిని ఎంపిక చేసే పనిలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది.

సాధారణ పరిస్థితుల్లో అయితే.. దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా ప్రభావం చాలా తక్కువ. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉండేది. అలాంటిది కర్ణాటకలో ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కేరళలోనూ కమలబలం మెరుగుపడింది. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న సీట్లు పోగొట్టుకుని, ఒకే స్థానంతో కుదేలైనప్పటికీ.. ఎంపీ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా నాలుగు సీట్లు గెలిచి.. ఆశలను పదిలం చేసుకుంది. తెలంగాణలో ద్వితీయ ప్రత్యామ్నాయం అనే దశ నుంచి అధికారం ఆశించే స్థితికి రావాలనుకుంటోంది. ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో చేసిన ద్రోహానికి, ఎన్ని వలసలు వస్తున్నా.. పార్టీ బలపడిన సంకేతాలు కనిపించడం లేదు.

ఇలాంటి తరుణంలో.. భాజపా, తమిళనాడుమీద కూడా ఫోకస్ పెంచుతోంది. అక్కడ.. అవశేషాలుగా మారిన కొన్ని పార్టీల్లోని నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల పోరాటం ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్న తరుణంలో.. ‘కచ్చితంగా అధికారంలోకి రాలేము..’ అనే భావనలో ఉన్న అన్నాడీఎంకే నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడానికి కమలదళం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు సమాచారం. అదే నిజమైతే, రాష్ట్రంలో అధికారం దూరమైనా సరే, కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలో చేరడానికి అన్నాడీఎంకే నాయకులు సిద్ధంగానే ఉంటారని అనుకోవచ్చు.
పైగా తమిళనాడులో తలైవా రజనీకాంత్ పార్టీతో పొత్తులు పెట్టుకుని బరిలోకి దిగాలని కూడా భాజపా భావిస్తోంది. పవన్ కల్యాణ్ లాగా తుస్సుమనిపించకుండా, సూపర్ స్టార్ పొలిటికల్ ఫోకస్ పెంచితే.. ప్రజల్లో రెస్పాన్స్ బాగుంటే.. ఆయనతో కలిసి నడవడం వల్ల తమ పార్టీకి ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతన బలమైన పునాదులు వేసుకోవచ్చునని కమలదళం ఆశలు పెంచుకుంటున్నట్లు సమాచారం.

అన్నాడీఎంకేకు కూడా కమలగండం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts