1987 రాజీవ్ – 2019 మోడీ.. ఇద్దరూ చెప్పింది ఒక్కటే !

September 7, 2019 at 11:08 am

ఆలోచ‌న రావ‌డ‌మే మొద‌టి విజ‌యం.. అడుగుముందుకు వేయ‌డం మ‌రో విజ‌యం.. అడుగుదూరంలో ఆగిపోవ‌డం.. అక్క‌డి నుంచి అనుకున్న ల‌క్ష్యాన్ని ముద్దాడ‌డం మాన‌వుడి అఖండ విజ‌యం.. ఇదే మంత్రం భార‌తీయుడిని ఇక్క‌డిదాకా తీసుకొచ్చింది.. జాబిల్లి దాకా న‌డిపించింది.. ఇప్పుడు మ‌నం అడుగుదూరంలోనే ఆగిపోయాం.. ఇక మిగిలింది అఖండ విజ‌య‌మేమ‌రి. చేసే ప్ర‌తీప్ర‌యోగంలోనూ విజ‌య‌మే దాగివుంది. అప‌జ‌యం అన్న‌మాట‌కు తావే ఉండ‌ద‌ని అంటారు శాస్త్రీయ ప్ర‌యోగాల్లో.. అందుకే అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు ప్ర‌తీ ప్ర‌యోగ‌మూ ఒక మెట్టుగానే ఉంటుంది త‌ప్ప ఓట‌మిగా క‌నిపించ‌దు శాస్త్ర‌వేత్త‌ల‌కు. అందుకే ఈ రోజు మాన‌వ‌జాతికి ఇంత సాంకేతిక‌త అందుబాటులోకి వ‌చ్చింది.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామ‌ని అనుకోకండి.. చంద్ర‌యాన్‌-2 ప్ర‌యోగంలో చివ‌రిద‌శ‌లో అంటే.. విక్ర‌మ్‌ల్యాండ‌ర్ జాబిల‌మ్మ ఉప‌రిత‌లానికి కేవ‌లం 2.1కిలోమీట‌ర్ల దూరంలో ఉండ‌గా సంబంధాలు తెగిపోయిన విష‌యం తెలిసిందే. నిజానికి..ఇస్త్రో చేప‌ట్టిన అద్భుత‌మైన సాహ‌సిక ప్ర‌యోగ‌మ‌ని ప్ర‌పంచ‌మంతా ప్ర‌శంసిస్తోంది. అడుగుదూరంలోనే ఆగిపోయాం.. త‌ప్ప చందమామ‌ను అందుకున్న‌ట్టేన‌ని ప్ర‌ధాని మోడీ ధైర్యం చెప్పారు. శాస్త్ర‌వేత్త‌ల క‌ష్టాన్ని ప్ర‌శంసించారు. ధైర్యంగా ఉండండి..దేశం మొత్తం వీవెంటే ఉంటుంద‌ని చెప్పారు. అయితే..ఇక్క‌డ మ‌రొక విష‌యం చెప్పాలి.

నిజానికి.. రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా.. ప్ర‌భుత్వంలో ఏ పార్టీ ఉన్నా.. ఇస్త్రోకు మాత్రం అండ‌గానే ఉంటున్నాయి. శాస్త్ర‌వేత్త‌ల కృషిని మెచ్చుకుంటున్నాయి. అడుగడుగునా ప్రోత్స‌హిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఇస్త్రో ఈనాడు ఇంత‌టి స్థాయికి ఎదిగింద‌ని చెప్పొచ్చు. ఇలాంటి ఘ‌ట‌నే 1987లోనూ చోటుచేసుకుంది. అప్పుడుకూడా యావ‌త్ దేశం ఎంతో ఉత్కంఠ‌గా ఎదుర‌చూసింది. 1987, మార్చి నెలలో చేప‌ట్టిన ASLV-1 ప్రయోగం గురించి చెప్పుకోవాలి. ఈ ప్ర‌యోగానికి శ్రీహరికోటలో సర్వం సిద్ధం అయింది. 31 గంటల కౌంట్ డౌన్ కూడా పూర్తయింది.

అయితే.. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీతోపాటు గవర్నర్ కుముద్ బెన్ జోషి, ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఇస్రో చైర్మన్ డాక్టర్ యు.ఆర్.రావు ప్ర‌త్య‌క్షంగా వీస్తున్నారు. రెండతస్తుల మిషన్ కంట్రోల్ రూమ్ టెర్రేస్ మీద నుంచి రాకెట్ ప్రయోగాన్ని చూస్తున్నారు. ఈ ప్రయోగాన్ని చూడడానికి సుమారు పదివేలమంది ప్రేక్షకుల గేలరీలో ఉన్నారు. ఇక అనుకున్న టైంకు రాకెట్ ప్రయోగించారు. అది నిప్పులు చిమ్ముతూ రాకెట్ ఆకాశంలో దూసుకుపోయింది. ఇక ఈస‌మ‌యంలో వారందరూ ఎంతో ఆనందంగా ఒకరికొకరు శుభాకాంక్ష‌లు తెలుపుకుంటూ ఉన్నారు.

ఇంత‌లోనే అంటే.. ప్ర‌యోగించిన నిమిషంలోనే.. రాకెట్ బంగాళాఖాతంలో కూలిపోయింది. ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోయింది. అంద‌రిలోనూ బాధ‌.. ఇక అక్క‌డే ఉన్న ప్ర‌ధాని రాజీవ్ గాంధీ వెంట‌నే ఇస్త్రో శాస్త్ర‌వేత్త‌ల వ‌ద్ద‌కు చేరుకుని వారికి ధైర్యం చేప్పారు. ప్ర‌యోగాల్లో విజ‌యాలే ఉంటాయి త‌ప్ప అప‌జ‌యాలుఉండ‌వంటూ ధైర్యం చెప్పారు. ఇప్పుడు మోడీ కూడా అదే చెప్పారు. ఇలా భార‌త పాల‌కులు అండ‌గా ఉంటున్నారుకాబ‌ట్టే నేడు ఇస్త్రో ఈ స్థాయికి చేరుకుంద‌ని, ప్ర‌పంచం గ‌ర్వించే స్థాయికి ఎదిగింద‌ని చెప్పొచ్చు. గ‌గ‌న‌త‌లంలోఎన్నో ఘ‌న విజ‌యాల‌ను సొంతం చేసుకుంద‌ని చెప్పొచ్చు. ముందుముందు మ‌రిన్ని విజ‌యాల‌ను అందుకోవాల‌ని ఆశిద్దాం..

1987 రాజీవ్ – 2019 మోడీ.. ఇద్దరూ చెప్పింది ఒక్కటే !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts