కేసీఆర్ మార్క్ ట్విస్ట్‌..హ‌రీశ్ ముందు స‌రికొత్త స‌వాల్‌..!

September 9, 2019 at 12:56 pm

గులాబీ ట్రబుల్ షూట‌ర్ హ‌రీశ్ స‌రికొత్త స‌వాల్‌ను ఎదురుకోబోతున్నారు. దేశీయంగా ముంచుకొస్తున్న ఆర్థిక‌మాంద్యం వేళ‌.. ఆయ‌న రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆర్థిక మాంద్యం ప్ర‌భావం తెలంగాణ రాష్ట్రంపై కూడా ఉందంటూ స్వ‌యంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ప్ర‌క‌టించ‌డంతో ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈరోజు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 2019-20ఏడాదికి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతూ ఆర్థిక‌మాంద్యంపై ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంద‌ని, ముందుముందు ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉండబోతుంద‌ని ఆయ‌న చెప్పొకొచ్చారు.

అయితే.. ఇలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో ఆర్థిక‌మంత్రిగా హ‌రీశ్‌రావు బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో ఏం చేస్తారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో త‌న‌దైన శైలితో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు హ‌రీశ‌రావు. ఇన్నాళ్లూ.. పార్టీలో, ప్ర‌భుత్వంలో ఎక్క‌డ స‌మ‌స్య వ‌స్తే.. అక్క‌డ వాలిపోయి.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి గులాబీ ద‌ళ‌ప‌తి చేత శ‌హ‌భాష్ అనిపించుకున్నారు. తెలంగాణ తొలి ప్ర‌భుత్వంలో ఈట‌ల రాజేంద‌ర్ ఆర్థిక‌మంత్రిగా ప‌నిచేశారు. అప్ప‌టి ప‌రిస్థితులు వేరు. ఆర్థిక వ్య‌వ‌స్థ అంతా బాగుండ‌డంతో స‌వ్యంగా సాగింది. కానీ.. ఇప్ప‌టి ప‌రిస్థితులు వేరు.. ప్ర‌భుత్వం కూడా కాళేశ్వ‌రం లాంటి భారీ ప్రాజెక్టుల‌ను చేప‌ట్టింది.

అంతేగాకుండా.. సంకేక్ష ప‌థ‌కాల‌కు భారీగా నిధులు ఖ‌ర్చు చేస్తోంది. ఇందులో న‌గ‌దు రూపంలోనే ల‌బ్ధిదారుల‌కు ఎక్కువ‌గా ప‌థ‌కాల ఫ‌లాలు అందుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుండ‌డంతో ఇప్ప‌టికే రాష్ట్రంపై తీవ్ర‌స్థాయిలో ప్ర‌భావం ప‌డుతోందని స్వ‌యంగా కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఆర్థిక మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన హ‌రీశ్‌రావుకు ఇది పెద్ద స‌వాలేన‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. దేశీయంగా నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తూ.. ఆర్థిక‌మాంద్యాన్ని త‌ట్టుకుంటూ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని గాడిలో పెట్ట‌డం అంటే మాట‌లు కాదు.

ఈ క్ర‌మంలో ఏమాత్రం తేడా వ‌చ్చినా.. రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్రాజెక్టులు, భారీ ప‌థ‌కాల అమ‌లుపై తీవ్ర ప్ర‌భావం ప‌డే ప్ర‌మాదం పొంచి ఉంది. అది చివ‌ర‌కు ఆ నింద హ‌రీశ్ మీదినుంచే వెళ్లిపోవ‌డం ఖాయ‌మే మ‌రి. ఈ నేప‌థ్యంలో ఆర్థిక మంత్రి హ‌రీశ్ ఎలాంటి వ్యూహాల‌ను అమ‌లుచేస్తారు..? అనేది అంద‌రిలో ఆస‌క్తినిరేపుతోంది. ఒక‌వేళ‌.. ఆర్థిక‌మాంద్యం ప్ర‌మాదం నుంచి తెలంగాణ‌ను బ‌య‌ట‌ప‌డేస్తే.. అదొక రికార్డుగా ట్ర‌బుల్ షూట‌ర్ ఖాతాలో ఉండిపోతుందని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. హ‌రీశ్ ఏంచేస్తారో చూడాలి మ‌రి.

కేసీఆర్ మార్క్ ట్విస్ట్‌..హ‌రీశ్ ముందు స‌రికొత్త స‌వాల్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts