యాదాద్రి శిల‌ల‌పై కేసీఆర్ చిత్రాలా…!!

September 7, 2019 at 1:05 pm

శిల‌ల‌పై శిల్పాలు చెక్కినారు.. మ‌న‌వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు అన్నాడో క‌వి.. కానీ తెలంగాణ పాల‌కుడు కేసీఆర్ మాత్రం శిల‌ల‌పై శిల్పాలు చెక్కినాడు.. చ‌రిత్ర‌కే చెద‌లు ప‌ట్టించినాడు.. అంటున్నారు నేటి ప్ర‌జ‌లు.. ఇంత‌కు ఈ ఉక్క‌పోత మాట‌లెందుకు.. అస‌లేం జ‌రిగింది.. తెలంగాణ సీఎం కేసీఆర్ అంత‌కానీ ప‌ని ఏమి చేసాడు.. ఆయ‌నేమ‌న్నా కాని పని చేశాడా… ఆయ‌న ఏమి చేసినా ఎంతో కొంత సొంత ప్ర‌యోజ‌నం చూసుకుంటాడు… దానికే ఇంత అక్క‌సు వెళ్ళ‌గ‌క్కాలా… కేసీఆర్ ఏమ‌న్నా ఆయ‌న కోసం చేసుకున్నాడా.. చ‌రిత్ర పేరుతో ప్ర‌పంచానికి కొత్త కోణం చూపుతున్నాడు.. కాక‌తీయ రాజుల‌ను త‌ల‌ద‌న్నేలా స్వామి కార్యం స్వ‌కార్యం అన్న‌ట్లుగా చేసాడంతే.. దీనికే ఇంత తుల‌నాడాలా… కాకుంటే కేసీఆర్ ఓ దేవ‌స్థానంలో చేయాల్సిన ప‌నులు చేస్తున్నాడు అంతే… కాకుంటే మీరు ఓసారి లుక్కేయండి…

అది ఇప్పుడు యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాగా అవ‌త‌రించింది అనుకోండి.. అంత‌కు మాత్రం చ‌రిత్ర‌కు ఓ ఆన‌వాలుగా నిలిచిన న‌ల్ల‌గొండ జిల్లా.. ఆ జిల్లాలోని యాద‌గిరిగుట్ట అనే గ్రామంలో వెలిసిన దేవాల‌య‌మే యాద‌గిరి ల‌క్ష్మీన‌రిసింహాస్వామి. ఓ పెద్ద గుట్ట‌పై వెలిసిన ఈ దేవ‌స్థానంకు తెలంగాణ‌లో ఎంతో ప్రాశ‌స్థ్యం క‌లిగిన‌ది. ఓ సొరంగంలో స్వ‌యంభుగా వెలిసిన ల‌క్ష్మీన‌ర‌సింహాస్వామి భ‌క్తుల‌కు కొంగుబంగారంగా ప్ర‌తీతి. ఈ దేవ‌స్థానంను ఆంధ్ర‌పాల‌కులు కావాల‌నే నిర్ల‌క్ష్యం చేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఘ‌న‌త వ‌హించిన సీఎం కేసీఆర్ ఇదే పాయింట్‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నాడు. ఇక్క‌డే పాద‌ర‌సం లాంటి కేసీఆర్ మెద‌డుకు ప‌ని పెట్టాడు..

ఓ న‌యా ప్యూడ‌ల్ వ్య‌వ‌స్థ‌కు శ్రీ‌కారం చుట్టిన కేసీఆర్ త‌న‌దైన మార్క్ రాజ‌కీయానికి తెర‌లేపాడు. అదే యాద‌గిరి ల‌క్ష్మీన‌ర‌సింహాస్వామి పేరును ముందుగా ఎవ‌రికి అనుమానం రాకుండా యాదాద్రి అంటూ నామ‌క‌ర‌ణం చేశాడు. దీనికి మ‌త‌పెద్ద‌ల సాయం తీసుకున్నాడు.. ఇక ఎదురులేని సీఎం ఫ్యూడ‌ల్ కాలంలోని పాత చ‌ట్టాల‌కు ప‌ద‌ను పెట్టిన‌ట్లుగానే ధ్వంస ర‌చ‌న హింస వ‌చన కు స్కెచ్ వేశాడు.. అందుకే ముంద‌స్తుగా యాదాద్రి పేరు మార్చి త‌రువాత యాదాద్రిని పున‌ర్నిర్మాణం చేయాల‌ని ప్లాన్ వేశాడు. అనుకున్న‌దే త‌డువుగా కోట్లాది రూపాయ‌లు వెచ్చించి మ‌రో తిరుప‌తి చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నాన‌ని క‌ల‌రింగ్ ఇచ్చాడు. భ‌క్తులు మాత్రం కోట్ల నిథులు వ‌స్తున్నాయ‌నే ఆనందంలో మునిగిపోయారు…

ఇక ఇక్క‌డే కేసీఆర్ బుర్ర‌కు ప‌దును పెట్టాడు.. కాక‌తీయులు నిర్మించిన కాలం నాటి ఆల‌యాల‌పై కాక‌తీయుల ట్రెడ్‌మార్క్ ఎలా ఉందో.. త‌న హ‌యాంలో నిర్మించిన వాటికి త‌న మార్క్ ఉండాల‌ని త‌లంచాడు. అదే అదునుగా యాదాద్రి శిల్పాల‌పై చారిత్రిక నేప‌థ్యం పేరుతో రాజ‌కీయ‌, చరిత్ర‌కారుల ఫోటోల‌ను చెక్కించాడు.. పనిలో ప‌నిగా త‌న శిల్పాన్ని చెక్కించుకున్నాడు. కేవ‌లం త‌న శిల్ప‌మే కాదు.. త‌న పార్టీ గుర్తు చెక్కించాడు. ఆనాడు రాజులైతే ఎలా శిలాశాస‌నాలు చెక్కారో… ఎలా త‌మ ఉనికిని ప్ర‌జ‌ల‌కు త‌ర‌త‌రాలుగా గుర్తుండే కొండ‌గుర్తుల‌ను చెక్కించారో… ఇప్పుడు కేసీఆర్ మ‌రో చ‌క్ర‌వర్తిలాగా త‌న శిల్పాన్ని, త‌న పార్టీ గుర్తును చెక్కించాడు.. వీటితో పాటుగా ఆనాటి చ‌రిత్ర‌కు స‌జీవ సాక్ష్యాలు అంటూ వాటికి ఓ రంగు పులిమాడు.. ఈ చిత్రాల‌పై విమ‌ర్శ‌లు రాకుండా త‌న‌దైన శైలీలో ప‌థ‌క ర‌చ‌న చేశాడు..

యాదాద్రి లో భవిష్యత్ తరాలకు నేటితరం ఆనవాళ్లను మిగల్చడంతోపాటు మరో వెయ్యేళ్లు చరిత్రలో నిలిచిపోయేలా చేసుకుంటున్నాడు కేసీఆర్. యాదాద్రి ఆలయ ప్రాకార మండపంలోని రాతి స్తంభాలపై మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీతో పాటు త‌న చిత్రాన్ని, తెలంగాణ ప్రభుత్వ పథకాలైన హరితహారం, కేసీఆర్ కిట్‌ను, తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం, చార్మినార్‌, టీఆర్ఎస్ కారు గుర్తును, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణ జింక, జాతీయ పక్షి నెమలిని కూడా చెక్కారు. ఉద్యమ నేపథ్య చిత్రాలన్నీ అష్టభుజి ప్రాకార మండపంలో నిక్షిప్తం చేశారు.

ప్రస్తుతం చలామణీలో లేని పైసా, 2, 3, 5, 10, 20 పైసల నాణేల గుర్తులను కూడా చెక్కారు. బతుకమ్మ, నాగలి దున్నే రైతు బొమ్మలతో పాటు క్రికెట్, హాకీ చిత్రాలను కూడా స్తంభాలపై పొందపరిచారు. నేటి సంప్రదాయాలు, సంస్కృతితో పాటు ఆధ్యాత్మిక, పురాణ, ఇతిహాసాలను.. యాదాద్రి ఆలయంలోని శిలలపై శాసనాలుగా చెక్కుతున్నారు. తెలంగాణ ప్రజల జీవనవిధానం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆధునిక తెలంగాణ చరిత్రను రాతి స్తంభాలపై నిక్షిప్తం చేయాలని, భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్దేశించారని ఆలయ శిల్పులు చెబుతున్నారు. తొలిసారి.. పాదం నుంచి శిఖరం వరకు కృష్ణశిలతో గుడి రూపుదిద్దుకుంటోంది. రాజుల కాలంనాటి నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకుని.. యాదాద్రి పునర్నిర్మాణం జ‌రుపుతూ త‌న గురించి చ‌రిత్ర గుర్తించేలా కార్యాచ‌ర‌ణ అమ‌లు చేస్తున్నాడు కేసీఆర్‌.

యాదాద్రి శిల‌ల‌పై కేసీఆర్ చిత్రాలా…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts