ప‌వ‌న్ నివేదిక‌: రెండు విమ‌ర్శ‌లు.. నాలుగు దెప్పిపొడుపులు

September 14, 2019 at 4:00 pm

ఏపీలో అప్ర‌తిహ‌త విజ‌యాన్ని సొంతం చేసుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏపీ సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టి వంద రోజులు పూర్త‌య్యాయి. ఈ క్ర‌మంలోనే అన్ని పార్టీలూ కూడా త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నాయి. ఆయ‌న పాల‌న‌పై త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తున్నాయి. ఇది ప్ర‌జాస్వామ్యంలో ఎక్క‌డైనా జ‌రిగేదే. అయితే, మూకుమ్మ‌డిగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూడు పార్టీలు చేస్తున్న విమ‌ర్శ‌లు మాత్రం ఒకింత ఆలోచింప చేస్తున్నాయి. మూడు పార్టీలూ కూడా ఒకేత‌ర‌హా విమ‌ర్శ‌లు చేయ‌డం, వాటిలో పెద్ద‌గా మార్పు కూడా క‌నిపించ‌క పోవ‌డం వంటివి ఇప్పుడు అనుమానాల‌కు కూడా తావిస్తున్నాయి.

బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించాయి. ఈ మూడు పార్టీల విమ‌ర్శ ల్లోనూ పెద్ద‌గా తేడా క‌నిపించ‌డం లేదు. పైగా కొన్ని కొన్ని లైన్లు ఒకే విధంగా కూడా ఉన్నాయి. నేప‌థ్యంలో ప‌లువురు ఇదే త‌ర‌హా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. చేసిన విమ‌ర్శ‌ల‌ను చూస్తే.. ఫ‌క్తు టీడీపీని త‌ల‌పించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి వంద రోజుల పాల‌న‌ను ప్రామాణికంగా తీసుకుని ప్ర‌భుత్వంపై ముద్ర వేయ‌డం అనేది స‌రికాద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌తిప‌క్షాలు కాబ‌ట్టి వాటికి విమ‌ర్శించే హ‌క్కు ఉంటుంది కాబ‌ట్టి స‌రే అని అనుకోవాలి.

మిగిలిన పార్టీల‌కు త‌న‌కు భిన్న‌మ‌ని చెప్పుకొనే ప‌వ‌న్ కూడా ఇప్పుడు ఆ పార్టీల త‌ర‌హాలోనే విమ‌ర్శ‌లు చేయ‌డం విస్మ‌యానికి కార‌ణ‌మ‌వుతోంది. త‌న పార్టీ విధానం వేర‌ని చెప్పిన ప‌వ‌న్‌.. త‌న పంథాను కూడా అదేత‌ర‌హాలో న‌డిపిస్తారని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఆయ‌న ప్ర‌భుత్వంపై రెండు విమ‌ర్శ‌లు, నాలుగు వ్యాఖ్య‌లు, ఇంకొన్ని దెప్పిపొడుపుల‌తోనే స‌రిపుచ్చారు త‌ప్పితే.. ఇత‌మిత్థంగా త‌న వ్యూహాల‌ను ఆయ‌న ప్ర‌క‌టించ‌లేదు. ఈ ప‌నిని ఇలా కాకుండా ఇలా చేస్తే.. బాగుంటుంది! ఈ విషయంలో జ‌న‌సేన‌గా మా సూచ‌న‌లు ఇవీ. ఈ విష‌యంలో మా స‌ల‌హాలు ఇవి. అని ఎక్క‌డా జ‌న‌సేన అధినేత ప్ర‌క‌టించింది లేదు. కేవ‌లం విమ‌ర్శ‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ప‌వ‌న్ వ్య‌వ‌హారంపై పెద్ద‌గా ఆస‌క్తి లేకుండా పోయింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప‌వ‌న్ నివేదిక‌: రెండు విమ‌ర్శ‌లు.. నాలుగు దెప్పిపొడుపులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts