ఇసుక ధర : తెలంగాణ కంటె తక్కువే కానీ…

September 5, 2019 at 11:04 am

జగన్మోహన రెడ్డి సర్కారు కొత్త విధానంలో ఇసుక ధర ఎంతో బుధవారం నాడు ప్రకటించింది. గురువారం నుంచి ఈ కొత్త విధానం ద్వారా ఇసుక విక్రయాలు అమల్లోకి వస్తాయి. దీనికి సంబంధించి టెండర్లు ఎన్నడో పూర్తయ్యాయి. ధర తేల్చడం ఒక్కటే మిగిలింది. గనులశాఖ తమ ప్రతిపాదనలను మంగళవారమే జగన్ కు సమర్పించింది. వారు సూచించినట్లుగానే.. టన్ను ఇసుక ధరను రూ.375 గా నిర్ణయిస్తూ కేబినెట్ సమావేశం బుధవారం తీర్మానించింది.

పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కంటె ఏపీలో జగన్ సర్కారు ప్రకటించిన ధర తక్కువే. తెలంగాణలో ప్రస్తుతం టన్ను రూ.400 వంతున విక్రయిస్తున్నారు. అయితే.. ఏపీలో ఈ ధర 375గానే నిర్ణయించడం విశేషం. అంతమాత్రాన.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారం తగ్గుతుందని అనుకోవడానికి వీల్లేకుండా పోతోంది. ఎందుకంటే.. జగన్ ప్రభుత్వంలోకి రావడానికి ముందు.. లభిస్తున్న ఇసుక ధరతో పోల్చి చూసినప్పుడు.. ఈ ధర తక్కువ కాదు. పరిమితంగానే అయినా.. అప్పటికంటె ఎక్కువ ధరకే ప్రస్తుతం నిర్ణయం జరిగింది.

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రభుత్వం ఇసుక తీరువాలను రద్దుచేసి ఉచితంగా ప్రజలకు ఇస్తున్నట్లుగా చాలా ఆర్భాటంగా ప్రకటించింది. కానీ.. వాస్తవంలో ఉచిత ఇసుక ముసుగులో తెలుగుదేశం నాయకులు విచ్చలవిడిగా దోచుకుంటూ ఉండేవారు. జగన్ ప్రభుత్వంలోకి రాగానే.. ఇలాంటి దోపిడీలకు చెక్ పెట్టారు. కొత్త విధానం తీసుకువచ్చారు. తెదేపా హయాంలో ట్రాక్టరు ఇసుక ఇంచుమించుగా 1500 రూపాయల వద్ద ఉండేది.

ఇప్పుడు కొత్త విధానంలో.. 1687 రూపాయలు పడుతోంది. తెదేపా హయాంలో డిమాండును బట్టి ఇంతకంటె దారుణమైన రేట్లతో దోచుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అసలు ఇసుక విక్రయాలను నియంత్రించే ఒక నిర్దిష్టమైన వ్యవస్థ ఉండేది కాదు. ఇప్పుడు జగన్ ఈ విక్రయాలను మొత్తం వ్యవస్థీకృతంగా దోపిడీలేకుండా చేసినప్పటికీ.. కొన్నిచోట్ల గతంలో కంటె ధర ఎక్కువ అనిపించే ప్రమాదం ఉంది.

ఇసుక ధర : తెలంగాణ కంటె తక్కువే కానీ…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts