ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల‌కు నోటీసులు

September 17, 2019 at 2:18 pm

ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష టిడిపి ఎమ్మెల్యేలకు హైకోర్టు వరుసగా నోటీసులు జారీ చేస్తూ ఉండటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నికలను సవాలు చేస్తూ హైకోర్టులో ఆయ‌న‌పై పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్య‌ర్థి ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు బలరాంకు నోటీసులు జారీ చేసింది.

బలరాం వివాదం ఇలా ఉండగానే ఇప్పుడు మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల‌కు సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టిడిపి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్ ఎన్నికను సవాలు చేస్తూ వైసీపీ అభ్యర్థులు దాఖలు చేసిన ఎన్నికల వ్యాజ్యాలపై స్పందించిన హైకోర్టు ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చింది. ఈ కేసుల తదుపరి విచారణను అక్టోబర్‌ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్, జస్టిస్‌ ఎం.గంగారావు వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు.

విశాఖ ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎన్నికను రద్దు చేయాలని ఆయనపై పోటీ చేసిన కెకె. రాజు… రేపల్లె లో అనగాని సత్యప్రసాద్ ఎన్నిక సవాలు చేస్తూ మంత్రి మోపిదేవి వెంకటరమణ… విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గెలుపు రద్దు చేయాలని వైసిపి అభ్యర్థి బొప్ప‌న భ‌వ‌కుమార్ తరపున ఎన్నికల ఏజెంట్ శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

పిటిషనర్ల తరపున‌ న్యాయవాది తన వాదన వినిపిస్తూ ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు తమ ఆదాయం, వృత్తి వివరాలు పొందుపరచాల‌ని… వీరు వాటిని దాచి అఫిడ‌విట్ దాఖలు చేశారని… నిబంధనలకు విరుద్ధంగా అఫిడ‌విట్‌ దాఖలు చేసిన వీరి ఎన్నిక రద్దు చేయాలని ఆయ‌న కోర్టుకు వివరించారు.

ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల‌కు నోటీసులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts