రాజయ్య కామెంట్స్ తో టీఆర్ఎస్‌లో మ‌రో ముస‌లం..!

September 9, 2019 at 3:16 pm

గులాబీ కోట‌లో అసంతృప్త జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. వ‌రుస‌బెట్టి నేత‌లు త‌మ అసంతృప్తిని బ‌హిరంగంగా వెల్ల‌గ‌క్కుతున్నారు. రోజురోజుకూ గులాబీ జెండా ఓన‌ర్ల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. మాజీ హోంశాఖ మంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డి సంల‌చ‌న వ్యాఖ్య‌లు చేసిన కొద్దిసేప‌టికే.. యాదృచ్చికంగా మాజీ డిప్యూటీ సీఎం, ఉమ్మ‌డివ‌రంగ‌ల్ జిల్లా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజా కేబినెట్ కూర్పుపై మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే రాజయ్య బాహాటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తెలంగాణలో 11 నుంచి 12 శాతం మాదిగలున్నారని, కానీ కేబినెట్‌లో మాత్రం మాదిగలు లేరని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోమ‌వారం విలేకరులతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ…ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో మాదిగలు, ఏపీలో మాలలున్నారని తెలిపారు. అయితే మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాలని, విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తారని రాజయ్య వాపోయారు. నిజానికి.. ఆదివారం రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగిన విష‌యం తెలిసిందే.

ఇందులో ఆరుగురికి స్థానం క‌ల్పించారు. దీంతో తెలంగాణ కేబినెట్ సీఎంకేసీఆర్‌తో క‌లిపి 18మందితో ప‌రిపూర్ణ‌మైంది. అయితే.. ఇందులో మాదిగ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎస్సీ సామాజిక‌వ‌ర్గం నుంచి ఒక్క‌రికే.. అదికూడా మాల సామాజిక‌వ‌ర్గానికి కేటాయించారు సీఎం కేసీఆర్‌.
తెలంగాణ‌లో మాదిగ‌లు అధికంగా ఉంటార‌ని, అయినా.. మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పించ‌క‌పోవ‌డంపై ఎమ్మెల్యే త‌న అసంతృప్తిని వెల్ల‌గ‌క్కారు. కాగా, తెలంగాన తొలి డిప్యూటీ సీఎంగా రాజ‌య్య‌కు ప‌ద‌విక‌ట్ట‌బెట్టి…ఆరు నెల‌ల‌కే సీంఎ కేసీఆర్ ఆయ‌న‌ను తొల‌గించ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపిన విష‌యం తెలిసిందే.

కాగా, మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌తో మొదలైన అసంతృప్తి సెగ‌లు.. మాన‌కొండూరు ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌.. ఆ త‌ర్వాత మాజీ మంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డి.. తాజాగా ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య దాకా వ‌చ్చాయి. ఇందులో ఏకంగా నాయిని అయితే..ఒక అడుగుముందుకేసీ.. ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. కేసీఆర్ త‌న‌ను మోసం చేశారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ప‌రిణామాల‌తో గులాబీ శ్రేణుల్లో ఆందోళ‌న మొద‌లైంది. ముందుముందు మ‌రెంద‌రు నేత‌లు ఉన్నారోన‌ని లోలోప‌ల ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

రాజయ్య కామెంట్స్ తో టీఆర్ఎస్‌లో మ‌రో ముస‌లం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts