పోలవరం.. మరింత వివాదాస్పదం?

September 5, 2019 at 10:32 am

పోలవరం డ్యాంవ టెండర్లను రద్దుచేసిన విషయంలో.. ఆ కాంట్రాక్టును కోల్పోయిన సంస్థ నవయుగ కోర్టును ఆశ్రయించడం ద్వారా రభస చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. జగన్ సర్కారు అంతే నిశ్చింతగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయంలో తాము చేసిన పనిని మరింత గట్టిగా సమర్థించుకుంది. ఈ రద్దు నిర్ణయాలను, రీటెండర్లు పిలవడానికి తీసుకున్న నిర్ణయాలను, నవయుగ సంస్థకు చెల్లించిన ఎడ్వాన్సులను రికవరీ చేయాలనే నిర్ణయాలను బుధవారం నాడు జగన్ కేబినెట్ సమావేశంలో ఆమోదిస్తూ తీర్మానం జరిగింది. ఇప్పటికే హైడల్ ప్రాజెక్టు నిర్మాణం వ్యవహారం హైకోర్టులో నలుగుతున్న నేపథ్యంలో కేబినెట్ ఆమోదించిన తీర్మానం మరింత వివాదాస్పదం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

పోలవరం డ్యాం విషయంలో… జగన్మోహన రెడ్డి సర్కారు పట్టుదలతో వ్యవహరిస్తోంది. ఈ ప్రాజెక్టులో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సర్కారు నమ్ముతోంది. అందుకే ఎలాంటి సంకోచం లేకుండా సగంలో ఉన్న ప్రధాన డ్యాం పనులను కూడా రద్దు చేసేసింది. హైడల్ ప్రాజెక్టు పనులు ఇంకా మొదలు కానేలేదు. ఇలాంటి రద్దు మరియు రీటెండర్ల వలన పనులు జాప్యం అవుతాయని పోలవరం అథారిటీ పేర్కొన్నప్పటికీ.. లేఖ రాసినప్పటికీ జగన్ సర్కారు ఖాతరు చేయలేదు. అవినీతిని సహించదలచుకోలేదని దృఢంగా ఉండిపోయింది.

హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు చెల్లదని హైకోర్టు ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేసినా కూడా ప్రభుత్వంలో చలనం లేదు. దానికి బాధ్యత వహించాల్సిన జెన్‌కో హైకోర్టులోనే మరో అప్పీలు వేయగా… రద్దు నిర్ణయాలను పూర్తిగా సమర్థించుకుంటూ కేబినెట్ తీర్మానం చేయడం విశేషం. రీటెండర్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి వారాలు గడిచినా.. టెండర్లను ఆహ్వానించకుండా ఆపారు. కేబినెట్ తీర్మానం ద్వారా పచ్చజెండా వచ్చేసినట్టే గనుక.. టెండర్లు ఆన్ లైన్ లో అప్లోడ్ చేసేయవచ్చు.

పోలవరంతో ముడిపడి ఉన్న చాలా మందికి ఇష్టం లేని ఈ నిర్ణయాలను దూకుడుగా తీసుకోవడం వల్ల.. ఆ వివాదం ముదురుతుంది. అయినా పరిణామాలను ఫేస్ చేయడానికే జగన్ సర్కారు దృఢనిశ్చయంతో ఉంది.

పోలవరం.. మరింత వివాదాస్పదం?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts