రోజుకో వివాదం.. పూట‌కో ర‌గ‌డ‌.. ఆ వైసీపీ లేడీ ఎమ్మెల్యే తీరు!

September 23, 2019 at 10:19 am

ఆమె నిన్న మొన్న‌టి వ‌రకు స్టెత‌స్కోప్ ప‌ట్టుకుని ప్ర‌జ‌ల నాడి చూశారు. అనూహ్యంగా రాజ‌కీయ ప్ర‌వేశం చేసి.. జ‌గ‌న్ ఆశీస్సుల‌తో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. ఆ వెంట‌నే హైద‌రాబాద్ నుంచి త‌న మ‌కాంను ఏపీకి మార్చుకుని గుంటూరు జిల్లాలోని తాడికొండ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆమె డాక్ట‌ర్ శ్రీదేవి. ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన శ్రీదేవి తాజా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. వ‌చ్చీ రావ‌డంతోనే ఆమె మంత్రి వ‌ర్గంలో చోటు కోసం ప్ర‌య‌త్నించి.. వైసీపీలోని సీనియ‌ర్ల‌నే ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు.

ఏకంగా జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తితోనే సిఫార‌సు చేయించుకుని మంత్రి వ‌ర్గంలో బెర్త్ కొట్టేయాల‌ని భావించారు. అయితే, ఈ విష‌యంలో త‌న‌ను ఇన్వాల్వ్ చేయొద్ద‌ని చెప్పిన భార‌తి.. క‌లుగ‌జేసుకోక‌పోవ‌డం ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. అయితే, త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌నే అక్క‌సు, బాధ శ్రీదేవిలో రోజు రోజుకు పెరిగిపోయింద‌ని…. ఈ విష‌యాన్ని ఆమె స‌న్నిహితుల వ‌ద్ద వ్య‌క్తం చేస్తున్నార‌న్న టాక్ కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆమె రోజుకో వివాదం, పూట‌కో ర‌గ‌డ సృష్టిస్తూ.. నిత్యం వార్త‌ల్లో క‌నిపిస్తున్నారు.

వాస్త‌వానికి వైసీపీలో ఈమెక‌న్నాసీనియ‌ర్ మ‌హిళా నాయ‌కులు చాలా మందే ఉన్నారు. వీరికి ప‌ద‌వులు ద‌క్కినా.. ద‌క్క‌క పోయినా.. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తూ.. ముందుకు సాగుతున్నారు. కానీ, శ్రీదేవి మాత్రం వ‌చ్చీరావడంతోనే ప‌ద‌వుల‌పై క‌న్నేయ‌డంతో ప‌రిస్థితి శ్రుతి మించుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న గ్రానైట్ వ్యాపారుల నుంచి డ‌బ్బులు వ‌సూలు రంగం సిద్ధం చేసుకున్నార‌నే వార్త‌లు నిన్న మొన్న‌టి వ‌ర‌కు వార్త‌ల్లోకి వ‌చ్చాయి. ఏడాదికి 25 ల‌క్ష‌ల చొప్పన త‌న‌కు క‌ప్పం క‌ట్టాల‌ని ఆమె ఆదేశించార‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి.

ఈ వార్త‌లు స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం సృష్టించాయి. ఇక‌, ఇంత‌లోనే వినాయ‌క మండ‌పంలో పూజ‌ల కోసం వెళ్లిన సంద‌ర్భంలో ఆమె సృష్టించిన ర‌గ‌డ రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. త‌న‌ను దూషించార‌ని, తాను మండ‌పంలోకి వెళ్తే..దేవుడు మైల‌ప‌డ్డార‌ని అన్నార‌ని ఆమె శోకాలు పెడుతూ.. మీడియాముందుకు వ‌చ్చారు. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న గుంటూరు పోలీసులు ఇదంతా ఉత్తిదేన‌ని తేల్చేశారు. ముందు కేసులు బుక్ చేసినా.. వీటిని వెనక్కి తీసుకున్నారు. అంత‌కు ముందే బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్‌తో ఏర్ప‌డిన వివాదం నేప‌థ్యంలో ఆమె సురేష్‌కు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నేంట‌ని ఏకంగా సీఎం జ‌గ‌న్‌కే ఫిర్యాదు చేయ‌డం కూడా సంచ‌ల‌నం క్రియేట్ చేసింది.

తాజాగా .. మేడికొండూరు మండలం తురకపాలెంలో మసీదు శంకుస్థాపన కోసం మహిళా ఎమ్మెల్యేలు ఇద్దరు విచ్చేశారు. అయితే తన నియోజకవర్గం పరిధిలోని కార్యక్రమానికి చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీ రావడంపై స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. ర‌జ‌నీ మాత్రం తాను వ‌స్తున్నాన‌ని ముందే శ్రీదేవికి చెప్పినా కావాల‌నే త‌న‌ను అవ‌మానించార‌ని ఆమె మ‌త‌పెద్ద‌ల ముందు వాపోయింది. ఇది కూడా వివాదానికి దారితీసింది. నిన్న‌గాక మొన్న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన శ్రీదేవికి.. రాజ‌కీయాలు అర్ధం కాక ఇలా చేస్తున్నారా? లేక కావాల‌నే వివాదం సృష్టిస్తున్నారా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. మ‌రి వీటిని స‌రిదిద్దేది ఎవ‌రో చూడాలి.

రోజుకో వివాదం.. పూట‌కో ర‌గ‌డ‌.. ఆ వైసీపీ లేడీ ఎమ్మెల్యే తీరు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts