ఫ్యాన్ గాలి కోసం సుబ్బిరామిరెడ్డి ఆరాటం..?

September 19, 2019 at 3:46 pm

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ఎంపీ టీ సుబ్బిరామిరెడ్డి ఫ్యాన్ గాలి కోసం ఆరాట‌ప‌డుతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్ పార్టీ త‌రుపున విశాఖ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన సుబ్బిరామిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొన‌సాగుతున్నారు. వచ్చే ఏడాది మార్చితో పదవీకాలం పూర్తి అవుతోంది. ఆ త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏమిట‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. విశాఖనే నమ్ముకుని ఎంపీగా వ చ్చే ఎన్నికల్లో నిలబడతారా లేక మరోమారు రాజ్యసభ కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ వైపు వస్తారా అన్న చర్చ సాగుతోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఐదేళ్ల త‌ర్వాత గాని ఆయ‌న పోటీ చేయాల‌న్నా కుద‌ర‌దు.

విశాఖకు సంబంధించి నెల్లూరు రెడ్డి గార్లు చాలా మంది కనిపిస్తారు. అందులో అగ్రజుడు టి. సుబ్బిరామిరెడ్డి. ఆయన దాదాపు మూడు దశాబ్దాల క్రితం విశాఖకు వచ్చి సిటీని దత్తత తీసుకున్నానని చెప్పారు. ఆయన ఇక్కడ ఠంచనుగా రెండు కార్యక్రమాలు చేస్తారు. ఒకటి మహాశివరాత్రి, రెండు ఆయన పుట్టినరోజు. మిగిలిన సమయంలో ఆయన ఎక్కడ ఉన్నా విశాఖ జనాలకు కనిపించేది ఈ సందర్భాల్లోనే. ఆయన పుట్టిన రోజుని విశాఖ జనాలకు పండుగగా చేసి సినిమా తారలను రప్పించి వారికి సత్కారం చేస్తారు. అలాగే మహాశివరాత్రికి సాధువులను, స్వామిజీలను రప్పించి వారితో ఆధ్యాత్మిక పూజలు జ రిపిస్తారు.

టీ సుబ్బిరామిరెడ్డి కి జగన్ కి మంచి అనుబంధం ఉంది. వారిద్ద‌రినీ అనుసంధానం చేయడానికి విశాఖ శారదాపీఠం స్వామిజీ కూడా ఉన్నారు. సుబ్బిరామిరెడ్డి కోరుకోవాలే కానీ వైసీపీలో రాజ్యసభ సీటు గ్యారంటీ అంటున్నారు. అలాగే విశాఖ లోక్‌స‌భ‌ సీటుని ఇవ్వడానికి కూడా జగన్ సుముఖంగా ఉన్నార‌ట‌. ఇప్పటికే విశాఖను నోడల్ జిల్లాగా తీసుకున్న వీ విజయసాయిరెడ్డి కూడా నెల్లూరు రెడ్డిగారే. ఈక్ర‌మంలో నెల్లూరుకు చెందిన టీఎస్సార్ కూడా వైసీపీలో చేరితే విశాఖ వైసీపీ కొత్త బలం సంతరించుకుంటుందని అంటున్నారు.

విశాఖ‌లో సుబ్బిరామిరెడ్డికి ప‌ర్స‌న‌ల్ ఇమేజ్ కూడా ఉంది. అస‌లే విశాఖ సిటీలో స‌రైన బ‌లం లేకుండా వైసీపీ ఇబ్బందులు ప‌డుతోంది. ఇప్పుడు త్వ‌ర‌లో జ‌రిగే గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు ఎలా ? ఎదుర్కోవాలా ? అని త‌ల‌మున‌క‌లు అవుతోంది. ఇలాంటి టైంలో విశాఖ‌లో ప‌ట్టున్న సుబ్బిరామిరెడ్డి లాంటి వాళ్లు వ‌స్తే అది వైసీపీకి కూడా ప్ల‌స్సే అవుతుంది.

ఫ్యాన్ గాలి కోసం సుబ్బిరామిరెడ్డి ఆరాటం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts