బాబును ఇర‌కాటంలో ప‌డేసిన కోడెల శివ‌రాం

October 1, 2019 at 11:08 am

టీడీపీలో ఒక వినూత్న‌మైన ప‌రిస్తితి ఏర్ప‌డింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌క్క‌న పెట్టిన‌, పెట్టాల్సిన నాయ కుల‌ను అనుకున్న వారిని టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌ప్ప‌కుండా ఆదుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఇప్పుడు ఆయ‌న ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌వుతున్నారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు దివంగ‌త స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు వార‌సుడిగా.. కోడెల శివ‌రామ్‌కు టికెట్ ఇచ్చేందుకు చంద్ర‌బాబు స‌సేమిరా అన్నారు. ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని, నివేదిక‌లు కూడా దీనినే స్ప‌ష్టం చేస్తున్నాయ ని బాబు చెప్పుకొచ్చారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఈ కుటుంబం తీవ్ర దుఃఖ సాగ‌రంలో మునిగిపోయింది. కార‌ణాలు ఏమైనా.. ప‌ల్నాటి పులిగా ప్ర‌చారంలో ఉన్న నాయ‌కుడు, సీనియ‌ర్ రాజ‌కీయ దురంధ‌రుడు ఇప్పుడు లేక‌పోవ‌డం, అటు పార్టీకి, ఇటు కుటుంబానికి కూడా తీవ్ర‌మైన లోటేన‌న‌డంలో సందేహం లేదు. ఇక‌, తాజాగా నిర్వ‌హించిన కోడెల సంతాప స‌భ‌లో ఆయ‌న కుమారుడు శివ‌రామ్ చేసిన వ్యాఖ్య‌లు టీడీపీలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. స‌హ‌జంగానే భావోద్వేగాలు మిళిత‌మైన త‌రుణంలో శివ‌రామ్ వ్యాఖ్య‌ల్లో చాలా లోతు క‌నిపించింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

నిజానికి టీడీపీ ప్ర‌భుత్వం అధికారం నుంచి దిగిపోయిన త‌ర్వాత చంద్ర‌బాబు ఈ కుటుంబాన్ని పక్క‌న పెడుతూ వ‌చ్చారు. స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాన్ని వేరే ఫ్యామిలీకి అప్ప‌గిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపించాయి. ముఖ్యంగా కోడెల‌కు కీల‌క‌మైన న‌ర‌స‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గం 2014లోనే ఈ కుటుంబానికి దూర‌మైంది. ఈ నేప‌థ్యంలో కోడెల కుటుంబాన్ని ప‌క్క‌న పెడుతున్నార‌ని అంద‌రూ అనుకున్నారు. ఇక‌, ఇప్పుడు శివ‌రామ్ వ్యాఖ్య‌ల ప్ర‌కారం.. చంద్ర‌బాబు ఈ కుటుంబానికి రాజ‌కీయంగా ఆస‌రా క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని తెలుస్తోంది.

చంద్ర‌బాబు మాట‌కు తాము బ‌ద్ధుల‌మ‌వుతామ‌ని, త‌మ‌కు చంద్ర‌బాబే దారి చూపించాల‌ని శివ‌రామ్ చేసిన వ్యాఖ్య‌ల్లో అంత‌రార్థం.. త‌న తండ్రి వార‌స‌త్వాన్ని త‌న‌కు అప్ప‌గించాల‌ని ఆయ‌న ప‌రోక్షంగా కోరుకోవ‌డ‌మే. మ‌రి దీనిని చంద్ర‌బాబు ఎలా చూస్తారో.. రాజ‌కీయంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. ఏదేమైనా కోడెల శివ‌రాం ప‌బ్లిక్‌గానే త‌న మ‌న‌సులో కోరిక‌ను బ‌య‌ట పెట్టుకుని కోడెల ఫ్యామిలీని సైడ్ చేయాల‌ని చూస్తోన్న చంద్ర‌బాబునే ఇర‌కాటంలోకి నెట్టేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే, ఇది భావోద్వేగ వ్య‌వ‌హార‌మే.. కానీ, రోజులు గ‌డిచే కొద్దీ ప‌రిస్థితులు మార‌తాయా? లేక నిజంగానే ఏమైనా చేస్తారా? చూడాలి.

బాబును ఇర‌కాటంలో ప‌డేసిన కోడెల శివ‌రాం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts