జ‌న‌సేన గెలిచిన చోట కూడా జంపింగ్‌లేనా… రీజ‌న్ ఇదే..!

October 17, 2019 at 12:08 pm

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సొంత పార్టీ నేతలే నమ్మకం కోల్పోతున్నారా ? రాష్ట్రంలో జనసేనకు భవిష్యత్ లేదని భావిస్తున్నారా ? చివ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరాభిమానులు సైతం రాజ‌కీయంగా ప‌వ‌న్ ఏదో సాధిస్తాడ‌న్న విష‌యం న‌మ్మ‌డం లేదా ? అంటే ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య జనసేన మొన్న ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ అంచనాలని అందుకోలేక దారుణంగా ఓడిపోయింది.

రాష్ట్రం మొత్తంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఆఖరికి పవన్ కల్యాణ్ కూడా గాజువాక, భీమవరంలలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ పార్టీ గెలిచిన ఏకైక స్థానం రాజోలు. తూర్పుగోదావ‌రి జిల్లాలోని ఈ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్ర‌మే ఆ పార్టీ గెలిచింది. ఇలా దారుణంగా ఓడిపోవడం, పవన్ కూడా పార్టీని మళ్ళీ బలోపేతం చేసే కార్యక్రమాలు చేయకపోవడంతో నేతలు నమ్మకం కోల్పోతున్నారు. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీలో భవిష్యత్ లేదని భావిస్తున్న నేతలు బీజేపీ, వైసీపీల్లోకి వెళ్ళిపోయారు. ఇక మరికొందరు అదే పని లో బిజీగా ఉన్నారు. ఇటీవల జనసేనకు చింతల పార్థసారథి, చింతలపూడి వెంకట్రామయ్యలు గుడ్ బై చెప్పేశారు.

అలాగే రాజమండ్రి ఎంపీగా జనసేన తరుపున పోటీ చేసి ఓడిపోయిన ఆకుల సత్యనారాయణ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. అయితే ఓడిన చోట వెళ్లిపోవడం కాకుండా, గెలిచిన రాజోలు నియోజకవర్గ నేతలు కూడా పవన్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. పైగా నియోజవర్గ అభివృద్ధి కూడా జరగడం లేదనే భావనతో రాజోలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణం రాజు తాజాగా వైసీపీలో చేరారు. ఎన్నికల సమయంలో రాజు జనసేన విజయం కోసం కష్టపడ్డారు. ఇక ఈయనతో పాటు మరికొందరు నేతలు కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు.

అటు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఆయనకు జనసేనలో అవమానాలు కూడా ఎదురవుతున్నాయి. దీంతో ఆయన పార్టీ మారుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని రాపాక ఖండించారు. మరి చూడాలి రానున్న రోజుల్లో జనసేనని ఇంకెంతమంది వీడుతారో.

జ‌న‌సేన గెలిచిన చోట కూడా జంపింగ్‌లేనా… రీజ‌న్ ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts