అచ్చెన్న‌ టార్గెట్ గా తెరపైకి ఈ‌ఎస్‌ఐ స్కామ్…

October 10, 2019 at 5:24 pm

జగన్ అధికారంలోకి వచ్చింది మొదలు గత టీడీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలని, అవినీతిని బయటపెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే పోలవరం సహ పలు ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వం చేసిన టెండరింగ్ లని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు వెళుతున్నారు. అలాగే విద్యుత్ పీపీఏల విషయంలో కూడా గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ వాటి పునః సమీక్షించేందుకు జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా తెలంగాణలో కుదిపేసిన ఈ‌ఎస్‌ఐ కుంభకోణం ఏపీలో కూడా జరిగిందని జగన్ ప్రభుత్వం విశ్వసిస్తుంది.

ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ మంత్రులుగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణల ప్రమేయంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. అయితే ఈ కుంభకోణంలో అసలు నిజాలు బయట పెట్టేందుకు విజిలెన్స్‌తో పాటు ఇంటిలిజెన్స్‌ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే వీరు ఐదు రోజులు నుంచి రాష్ట్రంలోని ఈఎస్‌ఐ డైరక్టరేట్‌ ఆసుపత్రులు, రిఫరల్‌ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు, టెలీహెల్త్‌ సర్వీసెస్‌ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల్లో రికార్డులను పరిశీలించి ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రులకు సహకరించిన డైరెక్టర్లు, జేడీలు, పీడీఎఫ్‌లు, పర్చేజింగ్ అధికారులు, ఫార్మాసిస్టులు, సచివాలయ సిబ్బంది, కాంట్రాక్టర్లపై రహస్య విచారణ జరుపుతున్నారు. అయితే విజిలెన్స్‌ పరిశీలనలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో టెలీహెల్త్‌ సర్వీసెస్‌తో ఒప్పందం చేసుకోవాల్సిందిగా అప్పటి డైరెక్టర్‌ను ఆదేశించిన లేఖ దొరికినట్లు సమాచారం. ఈ టెలీహెల్త్‌ కొన్ని పరికరాలకు బయట ఆసుపత్రుల కన్నా రెట్టింపులో వసూళ్లు చేసినట్లు తెలిసింది.

అంతేకాకుండా టెలీహెల్త్‌ కాల్‌ సెంటర్లలో పని చేసే సిబ్బందికి తక్కువ మొత్తంలో జీతాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో ఇస్తున్నట్లు రికార్డులలో చూపడం జరిగింది. అటు పితాని కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తనయుడు చక్రం తిప్పి తమకు అనుకూలంగా ఉన్న కంపెనీల మందులు భారీ ఎత్తున ఆర్డర్లు పెట్టించి వారి బిల్లులు మంజూరు చేయించినట్లుగా తేలింది. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓమ్నీ మెడీ సంస్థ ప్రతినిధులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

అయితే ఈ సంస్థ అనుబంధ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో 60 శాతానికిపైగా లావాదేవీలు జరిపినట్లు నిఘా వర్గాల పరిశీలనలో తేలింది. నిబంధనలకు విరుద్దంగా ఓమ్నీ సంస్థకు భారీ ఎత్తున చెల్లింపులు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మొత్తానికి చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం ఇద్దరు మాజీ మంత్రులని టార్గెట్ చేసుకుని ఈ‌ఎస్‌ఐ కుంభకోణాన్ని వెలికితీసే పని చేపట్టింది. మరి చూడాలి ఈ కుంభకోణంలో ఎవరు బుక్ అవుతారో.

అచ్చెన్న‌ టార్గెట్ గా తెరపైకి ఈ‌ఎస్‌ఐ స్కామ్…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts