ఆ విష‌యంలో జ‌గ‌న్ వెన‌క‌డుగు…!

October 21, 2019 at 11:43 am

గోదావ‌రి జ‌లాల వినియోగంపై ఏపీ సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారా..? ఏపీ, తెలంగాణ ఉమ్మ‌డి ప్రాజెక్టు కార్యాచ‌ర‌ణ నుంచి జ‌గ‌న్ త‌ప్పుకుంటున్నారా..? కేసీఆర్ గోదావరి నీళ్లు ఇస్తున్నారు.. తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎం జ‌గ‌న్‌.. ఇప్పుడు దానిని ప‌క్క‌న పెట్టాల‌ని అనుకుంటున్నారా..? అంటే తాజా ప‌రిస్థితులు ఔన‌నే అంటున్నాయి. ఇందులో భాగంగా సీఎం జ‌గ‌న్ ఉమ్మ‌డి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఏపీ భూభాగంలోనే ప్రాజెక్టుల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ కీల‌క నిర్ణ‌యంపై అంద‌రూ ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. నిజానికి.. న‌దీజ‌లాల వినియోగంపై ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్‌, కేసీఆర్‌లు ప‌లుమార్లు చ‌ర్చించిన విష‌యం తెలిసిందే.
అయితే.. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం న‌దుల అనుసంధానంపై ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే అందులో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు నీటిని రాయలసీమకు తరలించేందుకు గోదావరి – కృష్ణా – పెన్నా అనుసంధాన ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేర‌కు.. ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. పల్నాడులో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు.

అయితే.. ఇప్ప‌టి వైసీపీ ప్ర‌భుత్వం ఆ ప‌నుల‌న్నింటినీ ర‌ద్దు చేసింది. దీనిపై ప్ర‌తిప‌క్షం టీడీపీ నుంచి విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అయితే.. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరు తరలించేందుకు తెలంగాణతో కలిసి ప్రాజెక్ట్ కట్టే ఆలోచన సీఎం జ‌గ‌న్‌ చేయడంతో ఇక గోదావ‌రి- కృష్ణా- పెన్నా న‌ధుల‌ అనుసంధానం ఉండదని అంద‌రూ అనుకున్నారు. అయితే.. తెలంగాణ‌తో క‌లిసి ఉమ్మ‌డి ప్రాజెక్టు నిర్మించే ఆలోచ‌న నుంచి జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గిన‌ట్టు తెలుస్తోంది.

అందుకే గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం విషయాన్ని సీఎం జగన్ మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. తెలంగాణ భూభాగం మీదుగా గోదావరి జలాలను నాగార్జున సాగర్‌, శ్రీశైలం జలాశయాల్లోకి ఎత్తిపోయడం కన్నా.. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానంతోనే ఏపీకి ఎక్కువ ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌నే ఆలోచ‌న‌కు సీఎం జ‌గ‌న్ వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలించి.. అక్కడ నుంచి శ్రీశైలం కుడి కాలువ ద్వారా బానకచర్ల వరకు తీసుకెళ్లేందుకు ఎంత ఖర్చవుతుందో అంచనాలు రూపొందించాలని జలవనరుల శాఖను సీఎం జ‌గ‌న్ ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

అంతేగాకుండా.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్‌కు అప్పగించాలని ఆయ‌న‌ నిర్దేశించారు. ఈ నివేదిక వచ్చాక కార్యాచరణకు దిగాలని సీఎం జ‌గ‌న్ అనుకుంటున్నారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.

ఆ విష‌యంలో జ‌గ‌న్ వెన‌క‌డుగు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts