ద‌గ్గుబాటికి జ‌గ‌న్ అల్టిమేటం…!

October 10, 2019 at 10:30 am

వైసీపీలో ద‌గ్గుబాటి రాజ‌కీయం ఆస‌క్తిగా మారింది. పార్టీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి జారీ చేసిన అల్టిమేటంతో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారా ? అన్న‌ది ఇప్పుడు స‌స్పెన్స్‌గా మారింది. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు గ‌తంలో టీడీపీ, కాంగ్రెస్‌లో ప‌లుసార్లు ప‌ద‌వులు అనుభ‌వించారు. ఈ ఎన్నిక‌ల‌కు ముందు వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆయ‌న కుమారుడు హితేష్ చెంచురామ్ వైసీపీలో చేరారు. ఎన్నిక‌ల్లో ద‌గ్గుబాటి కుమారుడు హితేష్ చెంచురామ‌య్య పోటీ చేయాల్సి ఉన్నా ద‌గ్గుబాటే పోటీ చేశాడు. ఆయ‌న టీడీపీ అభ్య‌ర్థి ఏలూరి సాంబ‌శివ‌రావు చేతిలో ఓడిపోయారు.

ఆ ఎన్నిక‌ల్లోనే ద‌గ్గుబాటి భార్య, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వ‌రి బీజేపీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇలా ఎన్నిక‌ల త‌ర్వాత కూడా భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రు వేర్వేరు పార్టీల్లో కొన‌సాగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఏపీలో ఉన్న జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో ఘ‌ర్ష‌ణాత్మక వైఖ‌రితోనే ముందుకు వెళ్లేందుకు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలోనే ఏపీ బీజేపీ నేత‌లు వైసీపీపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పురందేశ్వ‌రి సైతం అధిష్టానం మెప్పుకోసం జ‌గ‌న్‌పై తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

పురందేశ్వ‌రి కేంద్ర మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకునే జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తున్న‌ట్టు భోగ‌ట్టా. ఈ నేపథ్యంలో కుటుంబమంతా వైసీపీలో ఉంటుందో.. లేక బీజేపీలో ఉంటుందో తేల్చాలని సీఎం జగన్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. పురందేశ్వ‌రితో బీజేపీకి రాజీనామా చేయించి.. వైసీపీలో జాయిన్ చేయాల‌ని ద‌గ్గుబాటిపై ఒత్తిడి పెరుగుతోంద‌ట‌. ఈ విష‌యంలోనే మాట్లాడేందుకు ద‌గ్గుబాటి నెల‌న్న‌ర రోజులుగా జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నా జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది.

అవ‌స‌ర‌మైతే ద‌గ్గుబాటిని జ‌గ‌న్ పూర్తిగా ప‌క్క‌న పెట్టేందుకు కూడా రెడీ అవుతున్నారు. గత ఎన్నికలకు ముందు పరుచూరులో వైసీపీ ఇన్‌చార్జిగా ఉండి.. దగ్గుబాటి రాకతో టీడీపీలో చేరిన రావి రామనాథంబాబును మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చారు. ఆయ‌న‌కు ఇప్పుడు పార్టీలో ప్ర‌యార్టీ ఇస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌నులు అన్ని ఆయ‌న చెప్పిన‌ట్టే చేయాల‌ని ఇప్ప‌టికే మంత్రుల‌కు కూడా ఆదేశాలు వెళ్లిపోయాయ‌ట‌. ద‌గ్గుబాటి మాత్రం జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు.

ఈ నేప‌థ్యంలోనే అటు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రితో పాటు త‌న‌యుడు హితేష్ చెంచురామ్ త‌మ అనుచ‌రుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ తిర‌కాసు రాజ‌కీయం నేప‌థ్యంలో ద‌గ్గుబాటి దంప‌తులు ఎటు వైపు ట‌ర్న్ తీసుకుంటారో ? చూడాలి.

ద‌గ్గుబాటికి జ‌గ‌న్ అల్టిమేటం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts