జ‌గ‌న్ గేట్లు ఎత్తేశారోచ్ …!

October 9, 2019 at 5:11 pm

ఏపీ సీఎం ఇపుడు గేట్లు ఎత్తేశారు.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకునే విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించిన జ‌గ‌న్ ఇప్పుడు గేట్లు ఎత్తేశారు. జ‌గ‌న్ ఈ విష‌యంలో గేట్లు ఎత్తేయ‌డంతో ఇక ఇత‌ర పార్టీల నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు వ‌ర‌ద‌లా ఉంటాయ‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ నేత‌ల‌ను చంద్ర‌బాబు నాయుడు త‌న‌పార్టీలోకి చేర్చుకున్నారు. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 23 మంది ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలో చేర్చుకున్న చంద్ర‌బాబు వాళ్ల‌ల్లో కొంత‌మందికి ఏకంగా మంత్రి ప‌ద‌వులు కూడా క‌ట్ట‌బెట్టారు.

అయితే ఇక్క‌డ వైసీపీ పార్టీ నుంచి రాజ్యాంగ‌బ‌ద్దంగా గెలిచిన ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను, ఎమ్మెల్సీల‌ను టీడీపీలోకి చంద్రబాబు పార్టీ కండువా క‌ప్పి ఆహ్వానించ‌డం జ‌గ‌న్‌కు రుచించ‌లేదు.. వాస్త‌వానికి పార్టీ మారిన ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అన‌ర్హులుగా ప్ర‌క‌టించాలి. చంద్రబాబు మాత్రం రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ల‌కు ఏకంగా కేబినెట్లో మంత్రి ప‌ద‌వులు కూడా క‌ట్ట‌బెట్టారు. అటు తెలంగాణ‌లో కేసీఆర్ కూడా అంతే చేశారు. ఇక అప్ప‌టి స్పీక‌ర్ దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద‌రావు సైతం ఈ విష‌యంలో బాబు ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి ర‌బ్బ‌ర్‌స్టాంప్ మాదిరిగా వ్య‌వ‌హ‌రించారు.

అయితే నంద్యాల ఉప ఎన్నిక‌ల టైంలో శిల్పా సోద‌రులు వైసీపీలోకి వెళ్లిన‌ప్పుడు జ‌గ‌న్ మాత్రం చ‌క్ర‌పాణిరెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశాకే పార్టీలో చేర్చుకుంటాన‌ని చెప్ప‌గా ఆయ‌న అలాగే చేశారు. తాను ఎప్పుడైనా ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను పార్టీలో చేర్చుకున్న‌ప్పుడు వారు ఆ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశాకే పార్టీలో చేర్చుకుంటాన‌ని చెప్పి అదే మాట మీద కంటిన్యూ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం టీడీపీ నుంచి గెలిచిన ప‌లువురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్నా జ‌గ‌న్ మాత్రం ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి రావాల్సిందే నంటూ చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఇక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్ టీడీపీ, జ‌న‌సేన‌కు చెందిన ప‌లువురు కీల‌క నేత‌ల‌ను పార్టీలో చేర్చేసుకుంటున్నారు. వీరి విష‌యంలో కండీష‌న్లు లేక‌పోవ‌డంతో వారంతా మూకుమ్మ‌డిగా వైసీపీలో చేరిపోతున్నారు. తాజాగా పార్టీలో చేరిన జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు, ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌తో పాటు విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వ‌రి, ప‌సుపులేటి బాల‌రాజు సైతం ఇప్పుడు ఇదే బాట‌లో ఉన్నారు. ఏదేమైనా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చాటేందుకు జ‌గ‌న్ గేట్లు ఎత్తేయ‌డంతో ఇత‌ర పార్టీల నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌ల వ‌ర‌ద కంటిన్యూ కానుంది.

జ‌గ‌న్ గేట్లు ఎత్తేశారోచ్ …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts