కోటంరెడ్డిది దూకుడా.. దుర‌దృష్ట‌మా…?

October 7, 2019 at 11:12 am

నెల్లూరు జిల్లా రూర‌ల్ ఎమ్మెల్యే , వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, జ‌గ‌న్‌కు హార్డ్ కోర్ అభిమాని.. కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి వివాదాల‌కు కేంద్రంగా మారారా? ఆయ‌న అన‌వ‌స‌ర వివాదాల్లో చిక్కుకుంటున్నారా? ఫ‌లితంగా ఆయ‌న‌కు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు త‌గ్గుతున్నాయా? నిరంత‌రం వ్య‌తిరేక మీడియాలో చిక్కి అభాసుపాల‌వుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పు డు.. ఒక‌విధంగా వివాదాస్ప‌దం అయ్యారంటే.. ఏదో అధికార ప‌క్షం చేసిన కుట్ర‌లో భాగ‌మేన‌ని భావించ వ‌చ్చు. లేదా ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు కాబ‌ట్టి ఆయ‌నను టార్గెట్ చేశార‌ని అనుకోవ‌చ్చు.

కానీ, ఇప్పుడు అధికార ప‌క్షంలో ఉన్న‌ప్ప‌టికీ.. కోటంరెడ్డికి వివాదాలు త‌ప్ప‌డం లేదు. ఆయ‌న కోరి తెచ్చు కుంటున్న క‌ష్టాలా? లేక యాదృచ్ఛికంగా వ‌స్తున్న వివాదాలా? అనే విష‌యం అప్ర‌స్తుతం. కొన్ని రోజుల కింద‌ట జ‌మీన్ రైతు అనే స్థానిక ప‌త్రిక ఎడిట‌ర్‌పై దాడి చేశార‌ని కోటంరెడ్డిపై పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. ఎడిట‌ర్ ఇంటికి మద్యం తాగి వెళ్లార‌ని, ఈ క్ర‌మంలో ఆయ‌న ఇంట్లో ఉన్న వెట‌ర్న‌రీ మ‌హిళా డాక్ట‌ర్ను కూడా త‌న వెంట తీసుకువెళ్లార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో.. స‌ద‌రు ఎడిట‌ర్‌ను చంపేస్తానంటూ.. కోటంరెడ్డి బెదిరించిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే, దీనిపై ఎలాంటి కేసు న‌మోదు కాలేదు. అయితే, అప్ప‌ట్లోనే సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా కోటంరెడ్డిని హెచ్చ‌రించార‌ని స‌మాచారం. దీంతో అప్ప‌టి నుంచి కోటంరెడ్డి సైలెంట్ అయిపోయారు. అయితే, ఇప్పు డు తాజాగా.. ఓ లే అవుట్‌కు నీటి క‌నెక్ష‌న్ ఇచ్చే విష‌యంపై ఎంపీడీవోను బెదిరించ‌డం, ఇంటిపైకి వెళ్లి దాడి చేశార‌నే ఆరోప‌ణ‌లు రావ‌డం వంటివి మ‌రోసారి కోటంరెడ్డిని సెంట‌రాఫ్‌ది టాపిక్ చేశాయి. అయితే, ఈ విష‌యంలో కోటంరెడ్డి దూకుడు ప్ర‌ద‌ర్శించారా? లేక వ్యూహాత్మ‌కంగా ఆయ‌న‌ను టార్గెట్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా.. పూట‌కో వివాదం కొని తెచ్చుకుంటే.. కెరీర్‌కు న‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కోటంరెడ్డిది దూకుడా.. దుర‌దృష్ట‌మా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts