తహసీల్దార్ హత్య వెనుక బయటపడ్డ అసలు నిజాలు !

November 5, 2019 at 11:37 am

తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డిని ఆమె కార్యాలయంలోనే సురేష్ ముదిరాజ్‌ అనే వ్యక్తి దారుణంగా సజీవదహనం చేసిన విషయం విదితమే. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో సురేష్ నేరుగా ఆమెపై పెట్రోల్ పోసి లైట‌ర్‌ వెలిగించడంతో విజయారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో సురేష్ కూడా 60 శాతం గాయాల‌తో ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే వైద్యుడి సమక్షంలో పోలీసులు సురేష్ వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. తాను ఎందుకు విజ‌యారెడ్డిని చంపానో కారణం కూడా హంత‌కుడు సురేష్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

ఎమ్మార్వోను ఎన్నో రోజులుగా… ఎంతగా బతిమిలాడినా ఆమె తనకు పట్టా ఇవ్వలేదని… సోమ‌వారం ఆమె ఆఫీస్‌కు వెళ్లి మ‌రోసారి బ‌తిమిలాడాన‌ని అయినా ఆమె ఒప్పుకోలేద‌ని చెప్పాడు. దీంతో మ‌ళ్లీ వెళ్లి పెట్రోల్ బాటిల్ తీసుకువ‌చ్చి ముందుగా తనపై కిరోసిన్‌ పోసుకుని.. తర్వాత ఆమెపై పోసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో తనకు నిప్పంటించుకుని విజయారెడ్డిని కూడా తగులబెట్టానని పేర్కొన్నాడు.

ఇక వివాదానికి కార‌ణ‌మైన భూమి విష‌యానికి వ‌స్తే బాచారంలోని దాదాపు 412 ఎకరాల భూమి గత 70 ఏళ్లుగా వివాదాల్లో కూరుకుపోయింది. మహారాష్ట్రకు చెందిన రాజా ఆనందరావు పేరిట ఉన్న ఈ భూమిలో 130 ఎకరాల భూమిని… రాష్ట్ర ప్రభుత్వం భూప్రక్షాళన అనంతరం తమకు విక్రయించాడని సయ్యద్‌ యాసిన్‌ వారసులు తెరపైకి వచ్చారు.

ఆ భూమిలో చాలా కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. ఇందులో హంత‌కుడు సురేష్ కుటుంబం కూడా ఉంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో ఈ భూమి ఉండటంతో కబ్జాదారులు దీనిని చేజిక్కించుకునేందుకు పథకం పన్నినట్లు తెలుస్తోంది. ఈ భూకబ్జాలో పలువురు రాజకీయ నేతల హస్తం కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భూమి మార్కెట్‌ విలువ సుమారు 40 కోట్ల రూపాయలు ఉంటుంద‌ని అంచ‌నా.

తహసీల్దార్ హత్య వెనుక బయటపడ్డ అసలు నిజాలు !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts