బీజేపీలోకి వైసీపీ ఎంపీ..!

November 18, 2019 at 11:32 am

కేవీపీ రామ‌చంద్ర‌రావు వియ్యంకుడు, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త క‌నుమూరు ర‌ఘురామ‌కృష్ణం రాజు ఎంపీ కావాల‌ని గ‌త ఏడెనిమిదేళ్లుగా ఎన్నో క‌ల‌లు క‌న్నారు.. ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. వైసీపీతో ప్రారంభ‌మైన రాజుగారి ప్ర‌స్థానం ఆ త‌ర్వాత బీజేపీ వ‌యా టీడీపీ చివ‌ర‌కు వైసీపీ గూటికే చేరింది. ఈ ఎన్నిక‌ల్లో చివ‌రి క్ష‌ణంలో టీడీపీ సీటు ద‌క్క‌పోవ‌డంతో వైసీపీలోకి వ‌చ్చిన ఆయ‌న న‌ర‌సాపురం నుంచి ఇంత బ‌ల‌మైన జ‌గ‌న్ వేవ్‌లో కూడా స్వ‌ల్ప తేడాతో ఎంపీగా గెలిచారు.

తన చిరకాల కోరిక నేరవేరినా… మళ్లీ పార్టీ మారేందుకు రాజుగారు సిద్ధమయ్యారా…? అంటే వైసీపీ వ‌ర్గాల్లో అవున‌నే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అస‌లు ర‌ఘురామ ఎంపీగా గెలిచిన రెండు నేల‌ల‌కే కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌కు ద‌గ్గ‌రయ్యారు. మోదీ, అమిత్ షాల‌ను ఆయ‌న స్పెష‌ల్‌గా క‌లిసి వ‌చ్చారు. అప్పుడే ఆయ‌న పార్టీ మార్పుపై వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ఎట్ట‌కేల‌కు పార్టీ మారబోతున్నారని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ విష‌యం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో కొంద‌రు వైసీపీ ఎంపీలు బీజేపీలోకి వెళుతున్న‌ట్టు జోరుగా వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఈ లిస్టులో ఏడెనిమిది మంది ఎంపీల పేర్లు వినిపిస్తున్నా ర‌ఘురామ‌కృష్ణం రాజు పేరు ముందుగా తెర‌మీద‌కు వ‌చ్చింది. పార్టీ ఖ‌చ్చితంగా ఓడిపోయే స్థానంలో నేను ఎంపీగా గెలిచాను.. పైగా మెగాస్టార్ ఫ్యామిలీ మెంబ‌ర్ నాగ‌బాబు మీద గెలిచాను.. అలాంటి నాకు స‌రైన ప్రాధాన్య‌త లేద‌ని.. పైగా ఢిల్లీలో ఓ ఆఫీస‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాల‌న్నా నాకు పార్టీ అనుమ‌తులు కావాలా ? అని ఆయ‌న ఫైర్ అవుతున్న‌ట్టు భోగ‌ట్టా..?

ఏపీలో ప్ర‌తి చిన్న అవ‌కాశాన్ని వాడుకునేందుకు బీజేపీ కాచుకుని కూర్చొని ఉంది. ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ‌కృష్ణం రాజు అస‌మ్మ‌తితో ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న‌పై సైతం వ‌ల వేసిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌నే పార్టీ మారితే వైసీపీ నుండి మరిన్ని వలసలు ఊపందుకునేలా కనపడుతోన్నాయి. ఏపీలో ఓ వైపు టీడీపీని ఖ‌తం చేసే ప‌నిలో వైసీపీ ఉంటే… ఇప్పుడు వైసీపీకి బీజేపీ నుంచి ముప్పు పొంచి ఉంద‌నేది తెలుస్తోంది.

బీజేపీలోకి వైసీపీ ఎంపీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts