బాబుకు మ‌రో షాక్‌..మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు జంప్ !

November 6, 2019 at 12:21 pm

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఊహించని ఘోర పరాజయంతో 23 సీట్లకే పరిమితం అయిన‌ టిడిపి రోజురోజుకు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుంది. ఆ పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు బయటపడదామా అని ఆలోచిస్తున్నారు. పార్టీలో సీనియర్లగా ఉండి నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసిన వాళ్ల నుంచి గ్రామ స్థాయి కేడర్ వరకు ఎవరికి వారు రాజకీయ భవిష్యత్తుపై డైలమాలో ఉన్నారు. మొన్నటికి మొన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు కీలకమైన విశాఖ నగరంలోనూ నేతలు పక్కచూపులు చూస్తున్నారు అన్న చర్చలు టిడిపిని టెన్షన్ పెట్టిస్తున్నాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న టైంలో పార్టీ తరఫున గెలిచిన నేతలు కూడా ఒక్క తాటిమీద నడవకుండా ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విశాఖ నగరంలో గత ఎన్నికల్లో నాలుగు సీట్లలో టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమలో గణబాబు, దక్షిణంలో వాసుపల్లి గణేష్ కుమార్, ఉత్తరంలో గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. ఇక గ‌న్న‌వ‌రంలో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వంశీ వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా… పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదన్న‌ నమ్మకంతో గుడ్ బై చెప్పేశారు.

వంశీ తనపై ఉన్న కేసుల వేధింపులు తట్టుకోలేకే పార్టీ వీడుతున్నా అని చెప్పినా… ఆయ‌న‌ సొంత పార్టీలోని నేతల తీరు నచ్చక కొంత బయటికి వెళ్లారు అని అంటున్నారు. ఇక ఇప్పుడు అదే బాటలో విశాఖ టీడీపీ లో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపిలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గత ఎనిమిది సంవత్సరాలుగా మంత్రిగా ఉండడంతో పాటు అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే అధికారం ఎక్కడ ఉంటే తాను అక్కడే అన్నట్టుగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు.

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్‌మార్చ్‌కు పిలుపు ఇచ్చారు. చంద్రబాబు సీనియర్లు అయినా అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు లను లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని పిలుపు ఇచ్చినా.. గంటా మాత్రం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇక అటు వైసీపీ ప్రభుత్వంపై కూడా ఎలాంటి విమర్శలు చేయడం లేదు. టిడిపి నేతలు కేసుల‌తో ఇబ్బందులు పడుతున్నా కూడా వాటిపై దృష్టి పెట్టడం లేదు. గంట పార్టీ మారడం దాదాపుగా ఫిక్స్ అయినా ఆయన వైసీపీలోకి వెళ్తారా బిజెపిలోకి వెళతారా అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది.

ఇక దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి కుమార్ సైతం పక్క చూపులు చూస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే వాసుపల్లి గణేష్ కుమార్‌కు, టిడిపి అర్బన్ అధ్యక్షుడు రెహ్మాన్ కు మాత్రం పొసగడం లేదట. దీంతో ఆయన విశాఖ నగరంలో టిడిపి చేపట్టే ఏ కార్యక్రమాలకు హాజరు కావడం లేదట. ఇక ఈ నేపథ్యంలోనే వాసుపల్లి గణేష్ కుమార్ సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో వాసుపల్లి గణేష్ కుమార్ కు, విశాఖ అర్బన్ అధ్యక్షుడు ఎస్ఏ.రెహమాన్ కు మధ్య జరిగిన ఘర్షణలపై నారా లోకేష్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ పార్టీలో లేకపోవడంతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ నియోజకవర్గంలో సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. ఇక త్వరలో జరిగే గ్రేటర్ విశాఖ ఎన్నికల నేపథ్యంలో అక్కడ విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతలను ఆయన పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహం పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో వాసుపల్లి పార్టీ మారిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా కీలకమైన విశాఖ నగరంలో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ వీడితే అది టీడీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ అవుతుంది.

బాబుకు మ‌రో షాక్‌..మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు జంప్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts