జగన్, చంద్రబాబుల్లో జైలుకు వెళ్ళేదెవరు..?

November 21, 2019 at 12:10 pm

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో జైలు రాజకీయాలు ఎక్కువైపోయాయి. మొన్నటివరకు ఈ జైలు రాజకీయం ఏకపక్షంగా జరిగేది. టీడీపీ నేతలు పదే పదే జగన్ జైలుకు వెళ్లిపోతాడని కామెంట్లు చేస్తూ ఉండేవారు. అయితే తాజాగా చంద్రబాబుపై కూడా ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఒకటి వచ్చి పడింది. 14 ఏళ్ల క్రితం నమోదైన ఈ కేసులో ఇప్పుడు స్టే ఎత్తివేయడంతో విచారణకు వచ్చింది. దీంతో ఇరు పార్టీల అధినేతల్లో ఎవరు జైలుకు వెళ్లతారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది.

అసలు ఈ కేసులు ఏంటి ఆ వ్యవహారం ఏంటనేది ఒక్కసారి పరిశీలిస్తే అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ 2011లో జైలుకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఆ కేసులో 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన జగన్ ఆ తరవాత బెయిల్ ద్వారా బయటకొచ్చారు. ఇక అప్పటి నుంచి ఆయన ప్రతి శుక్రవారం సి‌బి‌ఐ కోర్టుకు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఆయన పాదయాత్ర చేసిన శుక్రవారం బ్రేక్ ఇచ్చి మరి కోర్టుకు హాజరై వచ్చేవారు. ఇక ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు. దీంతో కోర్టుకు హాజరు కాలేనని కోర్టుకు విన్నవించుకున్నారు.

కానీ కోర్టు మాత్రం అవేం కుదరదు. సీఎం అయిన హాజరవ్వాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనకు శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్తితి వచ్చింది. అయితే జగన్ కేసుల విషయాన్ని టీడీపీ పదే పదే ప్రస్తావిస్తూ వైసీపీపై విమర్శలు చేస్తూనే ఉంది. తాజాగా కూడా కోర్టు జగన్ విన్నతిని తిరస్కరించడంతో టీడీపీ నేతలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఇప్పుడు కోర్టుకు రమ్మంటుంది. రేపు అనే రోజు బెయిల్ కూడా రద్దు చేసి జైలులో పెట్టేస్తారని సంబరపడిపోడుతున్నారు.

ఇలా టీడీపీ నేతలు ఆనందంగా ఉన్న సమయంలోనే వారికి పిడుగులాంటి వార్త తెలిసింది. 14 ఏళ్ల క్రితం స్టే తెచ్చుకున్న ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. ఇటీవల సుప్రీం కోర్టు ఆరు నెలలు దాటిన ఏ కేసుపైనైనా స్టే ఎత్తేయాలని నిర్ణయం తీసుకోవడంతో బాబు కేసు బయటకొచ్చింది. అసలు ఈ కేసు బాబు బద్ధశత్రువు, ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి 2005లో పెట్టారు.

చంద్రబాబు ఇచ్చే ఎన్నికల అఫడవిట్ ఆధారంగా కేసు వేశారు. అయితే అప్పుడు బాబు ఈ కేసుపై స్టే తెచ్చుకున్నారు. ఇక సుప్రీం కోర్టు నిర్ణయంతో 14 ఏళ్ల తర్వాత ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసు నిరూపించేందుకు లక్ష్మీపార్వతి ఆధారాలు రెడీ చేసుకుంటున్నారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, తాను నిప్పులాగా బ్రతికానని, వైఎస్సే తనపై 26 కేసులు వేసి ఏం చేయలేకపోయారని, ఈ కేసు వల్ల ఏం కాదని అంటున్నారు. కానీ వైసీపీ మాత్రం ఈ కేసులో బాబు జైలుకు వెళ్ళడం ఖాయమని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే లక్షిపార్వతి కూడా సాయం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక ఈ కేసు విషయంలో బాబు కూడా కోర్టు మెట్లు ఎక్కడం ఖాయమని వైసీపీ శ్రేణులు ఆనందపడుతున్నాయి. కాకపోతే ఇక్కడ చెప్పాలిసిన విషయం ఏమిటంటే ఏ నేత కూడా అంత తేలికగా జైలుకెళ్లే అవకాశాలు లేవు. ఒకవేళ జైలుకు వెళితే రెండు పార్టీలకు డ్యామేజ్ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి చూడాలి ఈ ఇద్దరు అధినేతల్లో ఎవరు జైలు గడప తొక్కుతారో? ఏ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోతుందో?

జగన్, చంద్రబాబుల్లో జైలుకు వెళ్ళేదెవరు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts