మెగాస్టార్ తొలి ద‌ర్శ‌కుడు.. సాయం కోసం చేతులు చాస్తున్నాడు..!

November 15, 2019 at 4:17 pm

ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్లుగా ఎదిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. అయితే మెగాస్టార్‌గా చిరంజీవి ఎద‌గ‌డానికి తొలిమెట్టు ఎక్కేద‌శ‌లో దిశ‌ను చూపి.. సినిమాలో హీరోగా అవ‌కాశం ఇచ్చిన తొలి ద‌ర్శ‌కుడు మాత్రం ఇప్పుడు చివ‌రి ద‌శ‌లో ఆప‌న్న హ‌స్తం కోసం చేతులు చాపుతున్నాడు.. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన మెగాస్టార్‌కు హీరోగా అవ‌కాశం ఇచ్చిన ఆ ద‌ర్శ‌కుడు ఇప్పుడు త‌న‌కు చివ‌రి ద‌శ‌లో ఎవ్వ‌రు బ‌తికే అవ‌కాశం ఇస్తారో అని ఎదురు చూస్తున్నాడు. ఇంత‌కు ఎవ‌రా ద‌ర్శ‌కుడు అనుకుంటున్నారా.

మెగాస్టార్‌ చిరంజీవి తొలిచిత్రం పునాదిరాళ్లు దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్‌ (75) కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆపన్న హస్త కోసం ఎదురుచూస్తున్నారు. తొలి సినిమాతోనే 5 నంది అవార్డులు అందుకొని రాజ్‌కుమార్‌ ఘనత సాధించారు. తీసినవి కొన్ని సినిమాలే అయినా అవన్నీ సామాజిక ఇతివృత్తాలే కావడం విశేషం. సామాజిక కోణంలో నిర్మించిన ఆ చిత్రాలతో ఎక్కడికో ఎదగాల్సిన ఆయనకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి.

ముందుకెళ్లే స్థోమత లేక వెనకబడ్డారు. ఎదిగొచ్చిన కొడుకు అనారోగ్యంతో మృతి చెందడం, తర్వాత కొద్ది రోజులకే సతీమణిని కూడా కోల్పోవడం ఆయనకు కోలుకోలేని దెబ్బ. వెనక్కి తిరిగి చూసుకుంటే మెగాస్టార్‌తో మొదటి సినిమా తీశానన్న సంతోషం మాత్రమే మిగిలింది. సొంతిల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ చివ‌రి ద‌శ‌ను కొన‌సాగిస్తున్నాడు. ఓవైపు బాధిస్తున్న అనారోగ్యం, మ‌రోవైపు అంద‌ని వైద్యం చేసుకునేందుకు లేని ఆర్థిక స్తోమ‌త దీంతో ఏమిచేయాలో తెలియ‌ని దీన‌స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా, గీత ర‌చ‌యిత‌గా, క‌థా ర‌చ‌యిత‌గా పనిచేసినా కూడా స‌ర్కారు చిత్రపురి కాల‌నీలో గూడు కోసం కాసింత జాగ కూడా ఇవ్వ‌లేదు. ప్ర‌స్తుతం ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్న ఈ ద‌ర్శ‌కుడి ప‌రిస్థితి ఎవ్వ‌రికి రావొద్దు. సాయం చేయాల‌నుకున్న‌వారు 70754 42277 నెంబ‌రుకు ఫోన్ చేయ‌వ‌చ్చు. సో ఇదో ద‌ర్శ‌కుడి జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌.

మెగాస్టార్ తొలి ద‌ర్శ‌కుడు.. సాయం కోసం చేతులు చాస్తున్నాడు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts