మాగంటి బీజేపీలోకి జంపేనా..!

November 8, 2019 at 11:48 am

రాజ‌కీయాల్లో మాగంటి బాబు కుటుంబానికి 130 సంవ‌త్స‌రాల సుదీర్ఘ‌మైన ప్ర‌స్థానం. మాగంటి సీతారామ‌దాసు నుంచి ప్రారంభ‌మైన ఈ కుటుంబ రాజ‌కీయాల్లో మాగంటి బాబు తండ్రి ర‌వీంద్ర‌నాథ్ చౌద‌రి, త‌ల్లి వ‌ర‌ల‌క్ష్మి ఇద్ద‌రు కూడా కాంగ్రెస్ నుంచి మంత్రులుగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ఈ దంప‌తుల రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన మాగంటి బాబు కూడా వైఎస్ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేశారు. 2009 ఎన్నిక‌ల టైంలో ఆయ‌న టీడీపీలోకి వ‌చ్చి ఆ పార్టీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

2014 ఎన్నిక‌ల్లో ఏలూరు ఎంపీగా ల‌క్ష ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయ‌న ఐదేళ్ల పాటు ఎంపీగా త‌న‌దైన ముద్ర వేయ‌లేక‌పోయారు. జిల్లా టీడీపీలో ఎమ్మెల్యేల డామినేష‌న్‌తో బాబు ఓ డ‌మ్మీ ఎంపీగా మిగిలిపోయారు. వ్యక్తిగ‌తంగా సౌమ్యుడు అన్న ముద్ర ఉన్నా ఆయ‌న రాజ‌కీయంగా త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం మాత్రం ఏర్ప‌రుచుకోలేదు. మొన్నటి ఎన్నికల్లో ఏలూరు ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ మాగంటి బాబు కొద్దిరోజులుగా ఎక్కడా కనిపించడం లేదు.

ఇటీవ‌ల పార్టీ అగ్ర నేత‌లు సొంత జిల్లాకు వ‌చ్చిన సంద‌ర్భాల్లోనూ ఆయ‌న ఎక్క‌డా క‌న‌ప‌డ‌డం లేదు. తాజాగా పార్టీ యువ‌నేత నారా లోకేశ్ ఏలూరుకు వచ్చినా మాగంటి ఆ కార్యక్రమాలు దేనికీ హాజరుకాలేదు. ఇక ఈ క్ర‌మంలోనే మాగంటి పార్టీ మార్పుపై ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. పార్టీలో స‌రైన గౌర‌వం ఇవ్వ‌లేద‌ని ఆయ‌న వాపోతున్నారు. ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు బాబుపై చింత‌ల‌పూడి, నూజివీడు, పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలో బాబుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఇక ప్ర‌భాకర్ నెల‌న్న‌ర‌కు పైగా జైలులో ఉన్నా మాగంటి క‌నీసం ప‌రామ‌ర్శ‌కు కూడా వెళ్ల‌లేదు. ఇటీవల చింతమనేనిని పరామర్శించేందుకు నారా లోకేశ్ స్వయంగా వచ్చి వెళ్ళారు. అప్పుడు జిల్లాకు చెందిన కీల‌క నేత‌లు, మాజీ ఎమ్మెల్యేలు వ‌చ్చ‌నా బాబు మాత్రం రాలేదు. తాను రాలేన‌ని నేరుగానే పార్టీ నేత‌ల‌కు ఆయ‌న చెప్ప‌డంతో వాళ్లంతా బాబు తీరుపై ఎక్క‌డా లేని సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రోవైపు ప‌శ్చిమ‌లో ఇప్పుడు ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో టీడీపీలో ఉంటే కుమారుడికి రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్న న‌మ్మ‌కం కూడా ఆయ‌న‌కు లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీ వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే మాగంటి స‌న్నిహిత వ‌ర్గాలు మాత్రం ఆయ‌న టీడీపీలో ఉంటార‌ని చెపుతున్నాయి. మాగంటి కుమారుడు రామ్‌జీ రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై చంద్ర‌బాబు స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చేవ‌ర‌కు మాగంటి డెసిష‌న్ ఏంటి అనేది చెప్ప‌లేని ప‌రిస్థితి..!

మాగంటి బీజేపీలోకి జంపేనా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts