టీడీపీ ఎంపీల‌కు అమిత్‌షా, గ‌డ్క‌రీ మ‌ర్యాద‌…

November 21, 2019 at 11:14 am

టీడీపీ ఎంపీల‌కు ఢిల్లీ బీజేపీ నేత‌లు ప్రియారిటీ ఇవ్వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో స‌రికొత్త చ‌ర్చ‌కు దారితీస్తోంది.
విజయవాడ ఎంపీ కేశినేని నానిని.. రోడ్డురవాణా, షిప్పింగ్‌ మంత్రిత్వశాఖ కన్సల్టేటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమించ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి నితిన్ గడ్కరీతో కేశినేనికి స‌న్నిహిత సంబంధాలున్నాయి. టీడీపీ హయాంలో.. నితిన్ గడ్కరీ సాయంతో.. విజయవాడకు అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఆ అనుభ‌మే ఇప్పుడు ఆయ‌న‌కు క‌మిటీలో స‌భ్యుడి ప‌ద‌వి ద‌క్కేలా చేసింద‌న్న‌ది బీజేపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట‌. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కు కేంద్ర హోంశాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో టీడీపీ ఎంపీకి అవకాశం కల్పించడంతో ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోందని రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇది టీడీపీ, బీజేపీల మ‌ధ్య పురివిప్పుతున్న స‌త్సంబంధాల‌కు సంకేతామా అనే ప్ర‌శ్న‌ల‌కు రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెప్ప‌లేం రాజ‌కీయ అవ‌స‌రాలు..అవ‌కాశాలు పార్టీల‌ను ఎటువైపైనా మ‌ళ్లించ‌వ‌చ్చ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు దేశం మొత్తం తిరిగిన తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు మోదీని ఓడించాల‌ని రాజ‌కీయ నినాదాల‌తో హోరెత్తించారు.

ఏకంగా ఫ్రంట్ రాజ‌కీయాల‌తో మోదీపై స‌మ‌రం చేశారు. మ‌మ‌తాబెన‌ర్జీకి సైతం త‌న మ‌ద్ద‌తు తెలియ‌జేశారు. ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, పార్టీల ముఖ్య నేత‌ల‌తో క‌ల‌సి చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగించారు. చంద్ర‌బాబు వైఖ‌రితో నాడు బీజేపీ అధ్య‌క్షుడు అమిత్‌షా మండిపడ్డారు. ఇక ఎప్ప‌టికీ చంద్ర‌బాబు బీజేపీ గ‌డ‌ప తొక్క‌లేర‌ని వ్యాఖ్య‌నించారు. ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ ప‌రిస్థితి తారుమారైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్తెస‌రు సీట్ల‌తో స‌ర్దుకుపోయి…అధికారాన్ని వైసీపీకి అప్ప‌గించింది. ఇక దేశంలో బీజేపీ హ‌వా కొన‌సాగింది. కేంద్రంలో అధికారంలోకి మ‌ళ్లీ వ‌చ్చింది.

చంద్ర‌బాబుపై వైఖ‌రి నిన్నా మొన్న‌టి వ‌ర‌కు మార‌లేదు. అయితే ఇటీవ‌లి కాలంలో కేశినేని..క‌న‌క మేడ‌లకు ప్రీయారిటీ ఇవ్వడం అదే స‌మ‌యంలో వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డిపై అమిత్‌షా ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం లాంటి ప‌రిణామాల‌ను రాజ‌కీయ కోణంలో టీడీపీ శ్రేణులు విశ్లేషించే ప‌నిలో ప‌డ‌టం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో టీడీపీ ఎంపీల‌కు ప్రాధాన్యం క‌ల్పించ‌డంపై వైసీపీలోనూ చ‌ర్చ మొద‌ల‌వ‌డం విశేషం.

టీడీపీ ఎంపీల‌కు అమిత్‌షా, గ‌డ్క‌రీ మ‌ర్యాద‌…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts