
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ లక్ష్యం ఏంటి? వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని చిత్తు చిత్తు చేసి క్లీన్ స్వీప్ చేయడం. అంతేకాదు. రాష్ట్రంలో ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవచించిన ప్రతిపక్షంతో పనేంటి? అనేది కూడా ఇప్పుడు జగన్ లక్ష్యంగా మారి పోయింది. రాష్ట్రంలో ప్రజలకు చేయాల్సినంత చేస్తున్నప్పుడు ఇక, ప్రతిపక్షంతో పనేంటనేది వైసీపీ నాయకుల ప్రధాన ప్రశ్న. ఇక్కడ వారు వ్యతిరేకిస్తోంది ప్రతిపక్షాన్ని ఎంతమాత్రం కాదు.
కేవలం టీడీపీనే..!! గత ఐదేళ్ల కాలంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఫిరాయించేలా చేసుకుని, వైసీపీని అన్ని విధాలా ఇబ్బంది పెట్టిన చంద్రబాబును అదే స్థాయిలో, అదే రేంజ్లో ఇబ్బంది పెట్టడం తోపాటు .. పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని జగన్ అండ్ కో భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జవసత్వాలపై వారు బలమైన వేటు వేయాలని భావిస్తున్నారు. టీడీపీకి అన్ని విధాలా అండగా ఉంటున్న ది కమ్మ సామాజిక వర్గం. మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ.. ఈవర్గమే రాజకీయంగా టీడీపీకి వెన్నెముక.
అలాంటి ఈ వర్గాన్ని పార్టీ నుంచి దూరం చేయడమే జగన్ ముందున్న ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే ఆయన రెండు రోజులుగా తన వ్యూహా న్ని పూర్తిగా అమలు చేస్తున్నారని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచినవారి చేతే ఇప్పుడు ఆయనపై ముప్పేట దాడి చేయిస్తున్నారు. నిజానికి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన చంద్రబాబు, ఆయన వియ్యంకుడు బాలయ్యతో పాటు మరో తొమ్మిది మంది విజయం సాధించారు.
ఈ క్రమంలోనే మరింత మంది ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే, పరాజయం పాలైన వారిలో చాలా మందికి వ్యాపారాలు ఉండడంతో వీరంతా ఇప్పుడు లోపాయికారీగా వైసీపీ నేతలతో చేతులు కలిపారు. దీంతో వీరంతా టీడీపీకి దూరంగా ఉన్నారు. చంద్రబాబు పిలుపు ఇచ్చినా.. స్పందన లేకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. ఇక, మిగిలిన గెలిచిన తొమ్మి ది మందిలో ఒకరు గన్నవరం ఎమ్మెల్యే వంశీ బయటకు వచ్చారు. దీంతో ఈ సంఖ్య ఎనిమిదికి పడిపోయింది. ఇప్పుడు జగన్ వ్యూహం అంతా కూడా వీరి చుట్టూతానే తిరుగుతోంది.
మీరు వస్తారా.. వైసీపీ కండువా కప్పుతాం.. లేకపోతే.. బీజేపీలోకి వెళ్లినా.. ఓకే చెబుతాం.. కానీ టీడీపీలో మాత్రం ఉండడానికి వీల్లేదనే ధోరణిలో ఒత్తిళ్లు పెరుగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం కమ్మ సామాజికవర్గ నేతలే లక్ష్యంగా జగన్ ఆపరేషన్ సాగుతోందని తెలుస్తోంది. త్వరలోనే దీనిని మరింత ఉధృతం చేసి, టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం సాగుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. దీనిని బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి..!!