టీడీపీలో వంశీ బ‌డ‌బాగ్ని… టీడీపీ నేత‌ల ఆలోచ‌న‌…!

November 16, 2019 at 11:48 am

ఇప్పుడు టీడీపీ రాజకీయంగా నిలబడాల్సిన అవసరం ఉంది. నాయకత్వాన్ని నిలబెట్టి, కార్యకర్తల్లో ఉన్న అభిమానాన్ని నిలబెట్టి, పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే పార్టీ మనుగడ అనేది సాధ్యమవుతుంది. కానీ నాయకులను కాపాడుకునే విషయంలో చంద్రబాబు పదే పదే విఫలమవుతున్నారనే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. బలమైన నేతలకు కూడా బాబు అండగా నిలవలేకపోతున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఇద్దరు కూడా బలమైన నేతలే అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు కీల‌క‌మైన కృష్ణా జిల్లాలో పార్టీలో కీల‌క నేత‌లు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది. వారికి వచ్చిన కష్టాలను తెలుసుకుని నేరుగా సమావేశమై భవిష్యత్తు మీద భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు ఈ విషయంలో విఫలం కావడమే కార్యకర్తలు, ఇతర నాయకులు తట్టుకోలేకపోతున్నారు.

రేపు ఇంకో ఐదు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. అప్పుడు చంద్రబాబు ఇంటి ముందు వంశీ అన్నట్టు చెక్ పోస్ట్ కూడా ఉండదు. మరి ఇలాంటి పరిస్థితులు నాయకులను కాపాడుకోకుండా చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి ఇబ్బందికరంగా మారింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు వంశీ పార్టీ మారే ముందు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రేపు ఆయన తరహాలోనే మరికొందరు పార్టీ మారి చంద్రబాబు మీద విమర్శలు చేస్తే పార్టీ మనుగడకే ప్రమాదం ఉంటుంది అనేది కొందరి వాదన.

రాజకీయంగా చంద్రబాబు అన్నీ చూసే వచ్చారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉన్న 21 మందిని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తర్వాతి టార్గెట్ గొట్టిపాటి రవి అంటున్నారు… ఆయన తర్వాత కరణం బలరాం, ఆ తర్వాత గంటా శ్రీనివాస‌రావు గ్యాంగ్ ఎమ్మెల్యేలు ఇలా ఒక్కొక్కరు వెళ్ళిపోతే రేపు ప్రతిపక్ష హోదా పోతే పార్టీ కనీసం ప్రజల్లోకి వెళ్లే అర్హత కూడా కోల్పోతుంది. అందుకే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.

టీడీపీలో వంశీ బ‌డ‌బాగ్ని… టీడీపీ నేత‌ల ఆలోచ‌న‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts