
స్మార్ట్‌ఫోన్ మనుషుల జీవితాలను తీవ్రంగా ప్రభావం చేస్తోంది. ప్రతీ పనికి ఓ యాప్ అంటూ వచ్చేయడంతో జీవనం సౌకర్యవంతమైంది. అయితే స్మార్ట్ ఫోన్‌తో ఎన్ని సౌకర్యాలు..వినోదాలున్నాయో..అంతేస్థాయిలో ప్రమాదాలు కూడా ఉన్నట్లు సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. పాక్, చైనాకు చెందిన హ్యాకర్లు భారత ఆర్మీ జవానుల వ్యక్తిగత, గ్రూప్ వాట్సాప్ గ్రూప్‌లోకి చొరబడి డేటాను తస్కరించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
గతంలోనూ ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ లకు చెందిన పలువురు పోలీసు అధికారులు, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, పారామిలటరీ దళాలకు చెందిన పలువురు అధికారుల సోషల్ మీడియా ఖాతాలపై దాడులు చేసేందుకు ఈ హ్యాకర్లు ప్రయత్నించారు. వాట్సాప్ లింక్‌లను పంపి భారత జవానుల, రక్షణ సంబంధిత అధికారుల ఫోన్లను హ్యాక్ చేయడానికి పలుమార్లు యత్నించారు.
ఈ పరిణామం నేపథ్యంలో సైబర్ నిపుణులు దేశ ప్రజలు, ముఖ్యమైన శాఖల్లో పనిచేసే అధికారులు కూడా వాట్సాప్ వినియోగంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. మెసేజ్ లపై క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, అనుమానాస్పద లింకులు ఏవైనా కనిపిస్తే గ్రూప్ అడ్మిన్ కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా +86తో ప్రారంభమయ్యే నంబర్లు వాట్సాప్ లోకి చొరబడి డేటాను దొంగిలిస్తున్నాయి.
కాబట్టి ఈ నంబర్లపై ఓ కన్నేసి ఉంచండి. ఈ నంబర్లతో అనుమానాస్పద మెసేజ్ లు వస్తే వెంటనే బ్లాక్ చేయాలని సూచిస్తున్నారు. అలాగే మొబైల్ నంబర్ ను మార్చినా పాత సిమ్ ను వెంటనే ధ్వంసం చేయడం శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు. లేదంటే క్లోనింగ్ చేయడం వంటి ప్రమాదాలకు దారి తీస్తుందని పేర్కొంటున్నారు. ఒకవేళ మీరు వాట్సాప్ గ్రూప్ కు అడ్మిన్ అయితే మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం.
ఎందుకంటే ఒకవేళ మీరు ఏదైనా గ్రూప్ కు అడ్మిన్ అయితే ఆ గ్రూపులో వచ్చే మెసేజ్ లకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా ప్రతీ ఒక్కరూ స్మార్ట్ టెక్నాలజీ వినియోగం అవగాహనను పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు.