అమ‌రావ‌తికి శుభం కార్డు.. జ‌గ‌న్ వ్యూహాత్మ‌క అడుగులు

December 14, 2019 at 10:23 am

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింది. అమ‌రావ‌తిని ఎక్క‌డికీ మార్చేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో అమ‌రా వ‌తిపై నిన్న మొన్న‌టి వ‌రకు నెల‌కొన్న ప్ర‌శ్న‌లు, సందేహాలకు ఇక‌, శుభం కార్డు ప‌డిన‌ట్టేన‌నిఅంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అనూహ్యంగా ఏపీ రాజధాని మార్పుపై అనేక పుకార్లు షికారు చేశాయి. అయితే ప్రభుత్వం ఈ ఉహాగానాలకు చెక్ పెట్టింది. రాజధాని మార్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ అనేక సార్లు గందరగోళానికి గురి చేశారు. అయితే ఆయనే ఇప్పుడు రాజధానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

ఏపీ రాజధాని అమరావతిని మార్చడం లేదంటూ లిఖితపూర్వకంగా బొత్స సమాధానం ఇచ్చారు. రాజధాని మార్చే ఉద్దేశం ఉందా ? అని టీడీపీ ఎమ్మెల్సీ అన్న ప్రశ్నకు అలాంటి ఉద్దేశం లేదని మండలిలో ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేసిన ‘సర్వే ఆఫ్‌ ఇండియా’ సంస్థ తన తప్పు దిద్దుకుంది. అమరావతిని గుర్తిస్తూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ఇటీవల సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన దేశ పటంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉంది కానీ, రాజధానిని గుర్తించలేదు. ఇది వివాదాస్పదంగా మారింది. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో ప్రస్తావించారు.

దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సవరించిన మ్యాప్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నవంబర్ 22న దేశ పటంలో అమరావతిని చేర్చుతూ సర్వే ఆఫ్‌ ఇండియా కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. మరోవైపు రాజధానిపై ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీకి విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వం వహించారు. ఈ కమిటీ ప్రజల నుంచి పలు సూచనలు తీసుకుంది. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో బొత్స సత్యనారాయణ ప్రకటించారు.దీంతో అటు రాజ‌ధాని రైతులు సహా రాజ‌కీయ పార్టీలు కూడా తీవ్ర ఆందోళ‌న‌, నిర‌స‌న‌ల‌కు దిగారు.

ఈ నేప‌థ్యంలో అస‌లు రాజ‌ధాని ఉంటుందా ? ఇక్క‌డ నుంచి మారుతుందా ? అనే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. దీంతో ఒకింత జ‌గ‌న్ స‌ర్కారు న‌లిగింద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో బీజేపీ కూడా కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకు వెళ్లాయి. అయితే, రాజ‌ధాని ఎంపిక‌, నిర్మాణం వంటివి పూర్తిగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోవి కావ‌డంతో కేంద్రం కూడా సైలెంట్ అయింది. ఈ నేప‌థ్యంలో ఏమ‌నుకున్నారో ఏమో.. జ‌గ‌న్ అనూహ్యంగా అమ‌రావ‌తిని మార్చే ప్ర‌సక్తి లేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి మున్ముందు ఎలాంటి వ్యూహాన్ని అనుస‌రిస్తారో ? చూడాలి.

అమ‌రావ‌తికి శుభం కార్డు.. జ‌గ‌న్ వ్యూహాత్మ‌క అడుగులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts