ఏపీలో జ‌న‌సేన జెండా ఉంటుందా…. పీకేస్తారా..?

January 9, 2020 at 5:54 pm

ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానంపై పార్టీ పెట్టినప్పటి నుంచి అనుమానాలే. రాజకీయంగా పూర్తి స్థాయిలో పోరాట౦ చేస్తాను అని ప్రకటించే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ విషయంలో దూకుడుగా వెళ్ళే ప్రయత్నం చేయలేదు. పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత సమస్యల కోసం జనసేన పుట్టింది అన్నట్టు ప్రధాన సమస్యలను ఎంచుకుని పోరాటాలు చేసిన పవన్ కళ్యాణ్ కాకినాడలో ఒక రోజు దీక్ష కూడా చేశారు. అయితే పార్టీ బలోపేతం మీద మాత్రం ఆయన దృష్టి పెట్టడం లేదు.

ఎప్పుడో ఒక‌ప్పుడు…ఆయ‌న‌కు గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి హ‌డావిడి చేయ‌డం మిన‌హా ప‌వ‌న్ చేస్తోందేమి లేదు. రాజకీయంగా జనసేన పార్టీకి బలం రావాలి అంటే క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. బూత్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేసుకుని ఎన్నికలకు సిద్దం కావాల్సిన అవసరం ఉంది. కాని పవన్ మాత్రం అందుకు తగిన విధంగా ఎక్కడా కనపడటం లేదు. ప‌వ‌న్
క‌ళ్యాణ్‌కు సినీ అభిమానుల బ‌లం మెండుగా ఉంది. అయితే ఈ ఫ్యాన్స్‌ను కార్యకర్తలుగా మార్చాల్సిన అవసరం ఉంది. కాని అది ఎక్కడా కనపడకపోవడంతో అభిమానుల్లో, కార్యకర్తల్లో కూడా అసహనం వ్యక్తమవుతుంది.

ఎన్నికలకు ముందు చివరి ఏడాది పార్టీ మీద దృష్టి పెట్టిన పవన్, జిల్లాల పర్యటనలు అంటూ, తన సామాజిక వర్గం బలంగా ఉన్న జిల్లాల్లో పోరాటాలు చేస్తూ వచ్చారు. ఉభయగోదావరి జిల్లాల్లో, అనంతపురం జిల్లాలో తిరిగారు గాని మిగిలిన జిల్లాల్లో ఎక్కడా కనపడలేదు. ప‌వ‌న్ తాను పోటీ చేసిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడిపోవ‌డం ఒక దెబ్బ అయితే.. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా త‌న బ‌లంతో గెలిచాన‌ని చెప్పుకోవ‌డం ప‌వ‌న్ బేల‌తానాన్ని చూచిస్తోంది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చెయ్యాల్సిన అవసరం ఉంది. అప్పుడే గ్రామ స్థాయిలో తనకు ఉన్నదీ ఫాన్స్ కాదు ఓటర్లు అనే విషయం పవన్ తో పాటు రాష్ట్ర ప్రజలకు, రాజకీయ పార్టీలకు తెలుస్తుంది. వార్డుల నుంచి మున్సిపాలిటీల వరకు కూడా ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు జనసేన పోటీ చెయ్యాలనే అభిప్రాయం ఆ పార్టీలో వినపడుతుంది. అయితే అందుకు త‌గ్గ కార్యాచార‌ణ మాత్రం ఎక్క‌డా క‌న‌ప‌డ‌డం లేదు.

అస‌లు ప‌వ‌న్ పార్టీ త‌ర‌పున పోటీ చేసేందుకు అభ్య‌ర్థులు అయినా దొరుకుతారా ? అన్న సందేహాలు ఉన్నాయి. మరి పవన్ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారో ఆ పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారో చూడాలి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపిస్తే జ‌న‌సేన జెండా ఉంటుంది.. లేక‌పోతే ఏపీలో కూడా జ‌న‌సేన జెండా ఉంచుతారా ? పీకేస్తారా ? అన్న‌దానిపై క్లారిటీ కూడా వ‌చ్చేస్తుంది.

ఏపీలో జ‌న‌సేన జెండా ఉంటుందా…. పీకేస్తారా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts