రాపాక చేతిలో ప‌వ‌న్‌కు ఘోర అవ‌మానం

January 11, 2020 at 2:58 pm

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంటే ఆ పార్టీ నేత‌ల‌కు ఎంత మాత్రం లెక్క‌లేకుండా పోతోంది. ఆ పార్టీ నేత‌లు ప‌వ‌న్‌ను ఎంత మాత్రం లెక్క‌చేయ‌డం లేదు. ఇక జ‌న‌సేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ సైతం ప‌వ‌న్ అంటే చాలా చాలా లైట్ తీస్కొంటున్నాడు. ఇప్ప‌టికే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మీటింగ్‌ల‌కు రాకుండా షాకుల మీద షాకులు ఇవ్వ‌డంతో పాటు తాను త‌న సొంత బ‌లంతోనే గెలిచాన‌ని చెప్పిన రాపాక మ‌రోసారి ప‌వ‌న్‌కు పెద్ద షాక్ ఇచ్చారు.

కొద్ది రోజులుగా రాపాక వైసీపీకి బాగా ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఆ పార్టీ మంత్రుల‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. అసెంబ్లీలో ఎంత మాత్రం వీలున్నా సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో పాటు వైసీపీ ప్ర‌భుత్వాన్ని విప‌రీతంగా పొగిడేస్తున్నారు. అంత‌టితో ఆగ‌ని రాపాక జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి ఇప్ప‌టికే రెండుసార్లు పాలాభిషేకం కూడా చేశారు. వైసీపీ ప్ర‌భుత్వం చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌ను కూడా పొగిడేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కాకినాడ‌లో ప‌వ‌న్ చేప‌ట్టిన దీక్ష‌కు సైతం ఆయ‌న డుమ్మా కొట్టేశారు.

అప్పుడే రాపాక వైసీపీలోకి వెళ్లిపోతార‌న్న టాక్ వ‌చ్చింది. తాజాగా రాపాక మ‌రోసారి ప‌వ‌న్‌కు షాక్ ఇచ్చారు. శ‌నివారం జనసేన పార్టీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన‌ సమావేశానికి రాపాక వరప్రసాద్ గైర్హాజరయ్యారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి అందరూ నేతలు వచ్చినా ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ మాత్రం డుమ్మా కొట్టారు. ఆయన అదే సమయంలో మంత్రి కొడాలి నానితో ఉన్నట్లు తెలుస్తోంది. రాపాక వరప్రసాద్ జనసేన సమావేశానికి గైర్హాజరవ్వడమే కాకుండా కొడాలి నాని వెంట ఉండటం చర్చనీయాంశమైంది.

గ‌తంలోనూ రాపాక వైసీపీ మంత్రులు పినిపే విశ్వ‌రూప్‌, కుర‌సాల క‌న్న‌బాబు లాంటి నేత‌లతో భేటీ అవుతూ వ‌చ్చారు. ఇక ఇప్పుడు కొడాలి నాని వంతు వ‌చ్చింది. నానితో క‌లిసి రాపాక ఒంగోలు జాతి ఎడ్ల పందేలను తిలకించారు. ఏదేమైనా ఇది రాపాక చేతిలో ప‌వ‌న్‌కు ఘోర అవ‌మానం లాంటిద‌నే చెప్పాలి. రాపాక‌పై జ‌న‌సేనాని ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేనేమో అన్న‌ట్టుగా ఉంది.

రాపాక చేతిలో ప‌వ‌న్‌కు ఘోర అవ‌మానం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts