రాజధానిపై జగన్ సరికొత్త వ్యూహం: సెలక్ట్ కమిటీ నివేదిక కంటే ముందే..

January 23, 2020 at 10:55 am

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలని మూడు రాజధానుల అంశం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో ఆమోదం పొందిన మూడు రాజధానులు, సి‌ఆర్‌డి‌ఏ రద్దు బిల్లులకు మండలిలో బ్రేక్ పడటం, ఆ బిల్లులని సెలక్ట్ కమిటీకి పంపించాలని మండలి ఛైర్మన్ ఆదేశించడంతో సీఎం జగన్ ఓ సరికొత్త వ్యూహంతో ముందుకొస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బిల్లులు సెలక్ట్ కమిటీకి సిఫారసు చేయడంతో…ఆ కమిటీ మూడు నెలల పాటు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని, బిల్లులకు సవరణలు చేసి అసెంబ్లీకి పంపిస్తుంది.
అయితే అందులో అసెంబ్లీ మళ్ళీ సవరణలు చేసి ఆమోదించి…మళ్ళీ మండలికి పంపొచ్చు. ఒకవేళ అక్కడ తిరస్కరణకు గురైతే, ఇక చివరికి అసెంబ్లీలో ఆమోదించి మూడు రాజధానులపై ప్రభుత్వం ముందుకు వెళుతుంది. కాకపోతే ఈ ప్రక్రియ జరగడానికి చాలా సమయం పట్టే అవకాశముంది. ఈ క్రమంలోనే సెలక్ట్ కమిటీ కంటే ముందే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్‌కు పంపే ఛాన్స్ ఉంది. కాకపోతే గవర్నర్ ఎంతకాలానికి ఆమోదిస్తారనేది కూడా తేలని అంశం.

అసలు ఇవన్ని కాదని ప్రభుత్వం తనకున్న అధికారాలని ఉపయోగించుకుని అసెంబ్లీ, మండలిలని కలిపి ఉభయ సమావేశం ఏర్పాటు చేసి, బిల్లులని ఆమోదించుకోవచ్చు. అయితే ఇది కూడా అంత సులువుగా జరిగే ప్రక్రియ కాదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సరే ఇది కూడా కాదు అనుకుంటే సెలక్ట్ కమిటీ నివేదిక వచ్చే లోపు ప్రభుత్వం తన పని తాను చేసుకెళ్ళోచ్చు. అది ఎలా అంటే అధికారికంగా సెలక్ట్ కమిటీ నివేదిక వచ్చే వరకు సచివాలయం తరలించకుండా… ఈలోగా న్యాయపరమైన ప్రతిబంధకాలు లేకుండా.. పలు ప్రభుత్వ శాఖాధిపతులను విశాఖకు తరలించే పని చేయొచ్చు. ఇక సెలెక్ట్‌ కమిటీ నుంచి బిల్లులు వచ్చాక… ఉత్తర్వుల ద్వారా సచివాలయ తరలింపుపై ముందుకెళ్లవచ్చు. మరి చూడాలి అసలు ఈ మూడు రాజధానులపై వైసీపీ ఏ విధంగా ముందుకెళుతుందనేది.

రాజధానిపై జగన్ సరికొత్త వ్యూహం: సెలక్ట్ కమిటీ నివేదిక కంటే ముందే..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts