మండలి రద్దు చేస్తే…ఆశావాహులకు జగన్ బంపర్ ఆఫర్

January 24, 2020 at 3:23 pm

ఊహించని పరిణామాల మధ్య మండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ…తన పంతం నెగ్గించుకుంటూ మూడు రాజధానులు, సి‌ఆర్‌డి‌ఏ రద్దు బిల్లులని సెలక్ట్ కమిటీకి పంపేలా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయంపై సీరియస్ గా ఉన్న సీఎం జగన్ ఏకంగా మండలినే రద్దు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. మండలి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, దాని వల్ల ఆర్ధిక భారం కూడా ఉంటుందని చెబుతూ…సోమవారం దీనిపై తుది నిర్ణయం తీసుకుందామని జగన్ చెప్పారు.

అంటే అన్నీ అనుకున్నట్లు జరిగితే సోమవారం అసెంబ్లీలో మండలి రద్దు బిల్లు ప్రవేశ పెట్టనున్నారు. అయితే ప్రస్తుతం మండలిలో టీడీపీకి మెజారిటీ ఉంది కాబట్టి..రద్దు చేయడం వల్ల వైసీపీకి పెద్ద పోయేది ఏం ఉండదు. అయితే రానున్న రోజుల్లో మాత్రం టీడీపీ సభ్యుల పదవి కాలం ముగిసి…వైసీపీ నేతలకు అవకాశం దక్కనుంది. ఇక ఎలాగో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దక్కని ఆశావాహులు ఎమ్మెల్సీలు దక్కుతాయని చూస్తున్నారు.

శాసనమండలిలో మొత్తం 58 సభ్యులు ఉన్నారు. అందులో ప్రస్తుతం 34 మంది సభ్యుల మద్దతు టీడీపీకి ఉంది. అధికార వైసీపీకి కేవలం 9 మంది సభ్యులే ఉన్నారు. అలాగే పి‌డి‌ఎఫ్, బీజేపీ, ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. అయితే 2021 జూన్ నాటికి దాదాపు 27 మంది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయాల్సి ఉంది. వారిలో ఎమ్మెల్యేల కోటాలో ఉన్న 8 మంది.. స్థానిక సంస్థల కోటాలో 11 మంది.. గవర్నర్ నామినేటెడ్ కోటాలో 6 అరు పదవులు ఖాళీలు అవుతాయి. ఇక ఇవన్నీ వైసీపీ వాళ్ళకే దక్కనున్నాయి.

మరి ఇలాంటి పరిస్థితుల్లో మండలి రద్దు చేయడం వల్ల వైసీపీ ఆశావాహ నేతల్లో టెన్షన్ మొదలైంది. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న 9 మంది సభ్యులకు కూడా టెన్షన్ ఉంది. అందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. మరి వీరందరికి జగన్ ఎలా న్యాయం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మండలి రద్దు చేయకుండా ఉంటే బాగుటుంది. ఒకవేళ రద్దు చేస్తే వేరే విధంగా వారికి పదవులు వచ్చేలా చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 13 జిల్లాలని నాలుగు జోన్లుగా ఏర్పాటు చేయాలని మూడు రాజధానుల బిల్లులో కలిపి పెట్టిన విషయం తెలిసిందే.

ఇక ప్రతి జోనుకూ ప్రత్యేకంగా ఓ తొమ్మిది మంది సభ్యులతో బోర్డ్‌ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రతి బోర్డులోనూ ఛైర్మనుగా సీఎం, వైస్ ఛైర్మనులు ఉంటారని తెలిసింది. అలాగే ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, నలుగురు ఇతర సభ్యులు కూడా ఉంటారని సమాచారం. అయితే మండలి రద్దు చేస్తే 6 జోన్లు ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ పదవులు దక్కాల్సిన వారికి అందులో అవకాశం కల్పించ వచ్చని తెలుస్తోంది. చూడాలి మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

మండలి రద్దు చేస్తే…ఆశావాహులకు జగన్ బంపర్ ఆఫర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts