శ్రీకాకుళంలో రాజుకున్న పొలిటిక‌ల్ వార్‌..!

February 22, 2020 at 12:40 pm

శ్రీకాకుళం రాజ‌కీయాలు భోగి మంట‌లుగా మారాయి. అధికార, ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన కీల‌క నేత‌ల మ‌ధ్య తీవ్ర వివాదాలు విభేదా లు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. ప్ర‌తిప‌క్షం టీడీపీకి చెందిన కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అచ్చ‌న్నాయుడు కేంద్రంగా తాజాగా ఈఎస్ ఐ కుంభ‌కోణం బ‌య‌ట‌కు వ‌చ్చిందని అధికార వైసీపీకి చెందిన మంత్రి, ఇదే జిల్లా న‌ర‌సన్న‌పేట ఎమ్మెల్యే ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు, అచ్చ‌న్న‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామని ఆయ‌న భారీ వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య రాజ‌కీయ వివాదం తార‌స్థాయికి చేరింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇరు ప‌క్షాల న‌డుమ వాస్త‌వానికి రాజ‌కీయ వైరం ఎప్ప‌టి నుంచో ఉంది.

అవ‌కాశం ఎదురు చూస్తున్నామ‌ని గ‌తంలో కృష్ణ‌దాస్ కూడా వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు అందివ‌చ్చిన అవ‌కాశంగా ఆయ‌న ఈఎస్ ఐలో జ‌రిగిన కుంభ‌కోణం క‌లిసి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల ఆరోగ్యానికి పూచీప‌డే ఈఎస్ ఐ విష‌యంలో అప్ప‌టి కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చ‌న్న ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రించార‌న్న‌ది మంత్రి ఆరోప‌ణ‌. మందులు, వైద్య ప‌రిక‌రాల కొనుగోలు విష‌యంలో చేతి వాటం చూపి.. త‌న వారికి ఇబ్బ‌డి ముబ్బ‌డిగా కాంట్రాక్టులు క‌ట్ట‌బెట్టి జేబులు నింపుకు న్నార‌ని మంత్రి ధ‌ర్మాన చేస్తున్న ఆరోప‌ణ‌లు. అయితే, వీటిని అచ్చ‌న్న అంతే రేంజ్‌లో తిప్పికొట్టారు. తాను ఈ విష‌యంలో జోక్యం చేసుకోలేద‌ని, కేవ‌లం టెలీ మెడిసిన్ విష‌యంలో కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాలు మాత్రమే ఇచ్చాను త‌ప్ప ఎవ‌రికీ సిఫార‌సులు చేయ‌లేద‌ని ఆయ‌న చెబుతున్నారు.

మొత్తంగా ఈ విష‌యంలో ఇంకా విజిలెన్స్ విచార‌ణ జ‌రుగుతోంది. అయితే, ఇంత‌లోనే ఈ విష‌యం రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపింది. ఎప్ప‌టి నుంచో ఉన్న రాజ‌కీయ వైరాలు కూడా తెర‌మీదికి రావ‌డం, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు తావివ్వ‌డం వంటి కార‌ణాలు జిల్లాలో రాజ‌కీయాల‌ను వేడెక్కించేలా చేశాయి. వాస్త‌వానికి ఏవైనా త‌ప్పులు జ‌రిగి ఉంటే చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని కానీ, చూసీ చూడ‌న‌ట్టు పోవాల‌ని కానీ ఎవ‌రూ చెప్పరు. అదేస‌మ‌యంలో ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయ కోణంలో చూడాల‌ని కూడా అన‌రు. ఇలా చేయ‌డం వ‌ల్ల అధికార పార్టీలో ఉన్న నాయ‌కులకే ఇబ్బంది ఏర్ప‌డుతుంది. ఇక‌, గ‌త పాల‌న‌లో త‌ప్పులు జ‌రిగాయో.. లేదో విజిలెన్స్ ఒక‌ప‌క్క విచార‌ణ చేస్తున్న నేప‌థ్యంలో గ‌తంలో మంత్రిగా ఉన్న అచ్చ‌న్న కూడా ఈ విష‌యంలో దూకుడు రాజ‌కీయాలు త‌గ్గించి వ్య‌వ‌హ‌రించ‌డ‌మే మంచిద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఏదేమైనా.. జిల్లా అభివృద్ధికి పూచీ ప‌డాల్సిన నాయ‌కులు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు తావివ్వ‌డం మంచిది కాద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

శ్రీకాకుళంలో రాజుకున్న పొలిటిక‌ల్ వార్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts