‘అమరావతి అసెంబ్లీ’ ఉంటుందో? ఉండదో.?

February 21, 2020 at 12:53 pm

జగన్మోహన రెడ్డి అధికార వికేంద్రీకరణ చేయదలచుకుని.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి లక్ష్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటవుతాయి. కానీ.. అలవిమాలిన ఆందోళనలు చేస్తూ… అందులోనూ ఆందోళనలను హింసాత్మక బాట పట్టిస్తూ వస్తున్న అమరావతి రైతులు.. ఈ ప్రాంతంలో అసెంబ్లీ కూడా ఉంటుందో ఉండదో.. దానినికూడా తరలించేస్తారేమో అనే కొత్ తసందేహాలకు తావిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామంలో ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న తీరు, ఆమె పట్ల వ్యవహరించిన వైఖరి.. రోజా స్పందన- ఆగ్రహం గమనిస్తే ఇలాంటి సందేహం కలుగుతుంది.

యూనివర్సిటీలో ఒక కార్యక్రమానికి వెళ్లి వస్తున్న రోజాను పెదపరిమి గ్రామంలో అడ్డుకున్న మహిళలు పెద్ద ఎత్తున గొడవ చేశారు. రోజాతో ‘జై అమరావతి’ అనిపించడానికి ప్రయత్నించారు. రోజా మెదలకుండా కారులోనే కూర్చుండిపోయారు. ఆందోళనకారులు కూడా వెనక్కు తగ్గకపోవడం.. పోలీసులు వారిని తొలగించడంలో కాస్త మెతగ్గా వ్యవహరించడంతో.. రోజా సుమారు గంటకు పైగా కారులోనే కదలకుండా ఉండిపోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత.. రోజా మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులను ఇలా తరచూ అడ్డుకుంటూ చికాకు పెడుతూ ఉండడం ద్వారా మీరు ఏం సందేశం ఇవ్వదలచుకుంటున్నారు.. అని ప్రశ్నించారు. ఎవ్వరినీ ఈ ప్రాంతంలో తిరగనివ్వరా? ఎమ్మెల్యేలుగా కూడా మేం ఇక్కడకు రావొద్దా..? ఇక్కడ అసెంబ్లీ కూడా ఉండొద్దా? అంటూ రోజా ప్రశ్నించారు. నా వాహనాన్ని అడ్డుకుని అనరాని మాటలన్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును నమ్మి మీ వేలితో మీ కంటినే పొడుచుకుంటూ ఉన్నారు అని కూడా ఆమె హెచ్చరించారు.

అయితే రోజా మాటలను బట్టి కలుగుతున్న కొత్త సందేహం ఏంటంటే.. ఇలాంటి వైకాపా నాయకులను అడ్డుకునే ఆందోళనలు శృతి మించితే గనుక.. అమరావతిలో అసెంబ్లీని కొనసాగించాలనే ఆలోచనను కూడా జగన్ సర్కారు విస్మరించవచ్చు. నామ్ కే వాస్తే ఉంచినప్పటికీ.. ఎటూ విశాఖలో రెండో అసెంబ్లీ కూడా అందుబాటులో ఉంటుంది గనుక… అమరావతి కార్యకలాపాలను పూర్తిగా తగ్గించేయవచ్చు. అప్పుడిక కనీసం శాసన రాజధానిగా కూడా అమరావతి హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ఆందోళనకారులు గుర్తెరిగి ప్రవర్తించాలి.

‘అమరావతి అసెంబ్లీ’ ఉంటుందో? ఉండదో.?
0 votes, 0.00 avg. rating (0% score)