త‌ప్పించుకుంటారా..? తిప్ప‌లు ప‌డ‌తారా?

February 22, 2020 at 10:43 am

ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌తీకార రాజ‌కీయాల‌కు తెర‌దీస్తున్న ధోర‌ణి క‌నిపిస్తోంది. గ‌తంలో త‌మిళ‌నాడు కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఇప్పుడు ఏపీలోనూ క‌నిపిస్తోంది. అధికారంలోకి వ‌చ్చిన వారు ప్ర‌తిపక్షంలో కూర్చున్న‌వారిపై ప‌గ సాధించ‌డం, గ‌త ప్ర‌భుత్వ తాలూకు నిర్ణ‌యాల‌ను తిర‌గ‌దోడ‌డం, వాటిలోని లోపాల‌ను వెలికి తీసి ఆయా నేత‌ల‌పై కేసులు న‌మోదు చేయ‌డం అనేది గ‌తంలో త‌మిళ‌నాడులో ఎక్కువ‌గా క‌నిపించింది. దివంగ‌త ముఖ్య‌మం త్రులు జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధులు ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా.. వారికి ముందు ప‌నిచేసిన వారి నిర్ణ‌యాల‌ను తిర‌గ‌దోడి తీవ్ర‌స్థాయిలో యుద్ధాలు చేసుకునేవారు. కానీ, ఇప్పుడు తొలిసారి ఏపీలో గ‌త ప్ర‌భుత్వంపై ప్ర‌స్తుత ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించ‌డం క‌నీవినీ ఎరుగ‌ని సంచ‌ల‌నంగా చెప్పొచ్చ‌ని అంటున్నారు నిపుణులు.

ఏపీ విభ‌జన త‌ర్వాత ఏర్ప‌డిన అవ‌శేష ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తొలి సీఎంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. ఆయ‌న వ‌చ్చీ రావ‌డంతోనే చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లు, అవినీతి, నిధుల దుర్విని యోగం పై లోతుపాతులు క‌నుగొనేందుకు మంత్రి వ‌ర్గంతో ఉప‌సంఘం ఏర్పాటు చేయించి అధ్య‌యనం చేయించారు. ఈ క‌మిటీ కొన్ని లోపాల‌ను గుర్తించి నివేదిక‌ను సీఎంకు అందించింది. అయితే, దీనిని మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేసి, అవ‌స‌ర‌మైన వారిని(వారుఎలాంటి వారైనా, ఎంత‌టి హోదాలో ఉన్నాకూడా, మాజీలైనా స‌రే) నేరుగా పిలిపించి విచారించి నిజాలు నిగ్గు తేల్చేలా.. తాజాగా 10మంది పోలీసు ఉన్న‌తాధికారుతో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నియ‌మించింది.

దీంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు సీఎం జ‌గ‌న్ ప‌ద్మ‌వ్యూహంలో చిక్కుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. బాబే టార్గెట్గా జ‌గ‌న్ వేసిన పాచిక స‌క్సెస్ అవుతుంద‌ని కూడా అంటున్నారు. ఇప్ప‌టి వ‌రకు తన హ‌యాంలో ఎలాంటి ఆరోప‌ణ‌లు లేవ‌ని, ఎలాంటి అవినీతీ లేద‌ని చెప్పుకొచ్చిన చంద్ర‌బాబు ఇప్పుడు సిట్ ద‌ర్యాప్తులో లోపాల‌కు ఎలాంటి స‌మాధానం చెబుతారోన‌ని అంటున్నారు. మ‌రీముఖ్యంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పార్టీ ని ముందుకుతీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్న చంద్ర‌బాబుకు ఇప్పుడు సిట్ దర్యాప్తు.. ఎప్పుడు పిలుపు వ‌స్తుందోన‌నే బెంగ కూడా ప‌ట్టుకుంటాయ‌ని చెబుతున్నారు. వ్యూహాత్మ‌క విన్యాసంతో రాజ‌కీయాలు న‌డ‌ప‌డం వేరు. కానీ, గ‌త ఐదేళ్ల పాల‌న‌లో జ‌రిగిన లోపాల విష‌యాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు ఏం చేస్తార‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా మారింది. మ‌రి బాబు ఈ వ్యూహం నుంచి బ‌య‌ట ప‌డ‌తారా? లేక చిక్క‌కు పోతారా ? అనేది చూడాలి.

త‌ప్పించుకుంటారా..? తిప్ప‌లు ప‌డ‌తారా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts