భాజపాకు జగన్ ఆఫర్ ఇదేనా …?

February 26, 2020 at 10:25 am

భారతీయ జనతా పార్టీ , జగన్మోహన రెడ్డి మధ్య సయోధ్య కుదరబోతున్నదనే ప్రచారం చాలా కాలంగా ఉంది. జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్రంలోని పెద్దలను కలిసి వచ్చిన తర్వాత.. ఆ పుకారు బాగా బలపడింది కూడా. ఆ ప్రచారం విని ఉడుక్కున్న పవన్ కల్యాణ్ తాను భాజపాతో మైత్రిని తెగ్గొట్టుకుంటానని కూడా ప్రకటించారు. అలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు మరోసారి భాజపా-వైకాపా స్నేహం తెరమీదకు వస్తోంది. పొత్తు కుదుర్చుకోవడానికి జగన్మోహన రెడ్డి భాజపాకు ఎలాంటి ఆఫర్ చేశారనేది కూడా చర్చనీయాంశంగా ఉంది.
ఇరు పార్టీల పొత్తుల గురించి మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఇది ఆసక్తికరం. అయితే ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వచ్చిన నేపథ్యంలో తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే భాజపా వైకాపాతో స్నేహాన్ని ఆశిస్తున్నట్లుగా కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం రాజ్యసభలో అవసరమైన సాధారణ మెజారిటీ కంటె పది సీట్ల తక్కువ ఉంది.

తాజాగా ప్రకటించిన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం.. 55 సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటిలో 23 భాజపా మిత్రపక్షాల స్థానాలే. తిరిగి నెగ్గడంలో భాజపా స్థానాల సంఖ్య మరింత తగ్గిపోయే సూచనలూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో భాజపా రాజ్యసభలో బలం పెంచుకోవడం కోసం పలువురిపై ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పటికే జగన్మోహన రెడ్డి కొన్ని కీలక బిల్లుల విషయంలో రాజ్యసభలో భాజపాకు సహకరిస్తున్నారు.

తాజాగా ఏకంగా ఎన్డీయేలో కలిసేలా పొత్తు పెట్టుకోవడానికి, కేంద్ర మంత్రివర్గంలో రెండు బెర్తుల పొందడానికి జగన్ వారికి ఒక రాజ్యసభ ఎంపీసీటును ఆఫర్ చేస్తున్నట్లుగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం ఈ నాలుగింటినీ వైకాపా గెలుచుకునే అవకాశమే ఎక్కువ. వాటిలో ఒక స్థానం భాజపాకు ఇస్తే వారికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. అందుకే ఒక సీటు ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.
ప్రస్తుత లెక్కల ప్రకారం.. ఈ ఎన్నికలు పూర్తయ్యేసరికి భాజపా బలం రెండు మూడు సీట్లు తగ్గుతుందని అంచనా. అయితే జగన్ ఒక ఎంపీ సీటు ఆఫర్ చేయడం నిజమే అయితే గనుక.. ఇలాంటి మాయోపాయాల్ని మరికొన్ని చోట్ల ప్రయోగిస్తే.. భాజపా పరువు కాపాడుకోగలుగుతుంది అని విశ్లేషణలు సాగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

భాజపాకు జగన్ ఆఫర్ ఇదేనా …?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts