నాటి జగన్ ఘటనతో పోల్చడం కరెక్టేనా?

February 28, 2020 at 10:07 am

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అడ్డుకుని, అక్కడినుంచి బయటకు రానివ్వకుండా.. అటునుంచి అటే పోలీసులు వెనక్కు తిప్పి హైదరాబాదు పంపేయడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. గతంలో జగన్ పట్ల మీరు ఎలా వ్యవహరించారో.. ఇవాళ మీకు అదే పరాభవం జరిగిందని వైకాపా మద్దతుదారులంతా వాదిస్తున్నారు. టిట్ ఫర్ టాట్ అంటున్నారు. కానీ.. స్థూలంగా గమనించినప్పుడు.. నాడు జగన్ కు జరిగింది వేరు.. ఇవాళ చంద్రబాబుకు జరిగింది వేరు.

గతంలో ప్రతిపక్షనేత జగన్మోహన రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ఉద్యమిస్తున్నప్పుడు విశాఖ బీచ్ లో ఉద్యమం చేయడానికి వెళ్లినప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది. జగన్మోహనరెడ్డిని విమానాశ్రయంలోంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో జగన్ రన్ వే మీదనే బైఠాయించి ధర్నా చేశారు. అప్పటి ప్రభుత్వాన్ని సహజంగానే నానా మాటలు అన్నారు. కానీ పోలీసులు వినిపించుకోకుండా.. ఆయనను అదే విమానంలో వెనక్కు తిరిగి పంపారు.

అప్పట్లో విశాఖ గణతంత్ర వేడుకలతో పాటు అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాట్లలో ఉన్నందున పోలీసులు జగన్ కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేదు. అనుమతులు ఇవ్వకపోయినా సరే చేసి తీరుతాం అంటూ జగన్ విశాఖ వచ్చేశారు. దాంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అనుమతులు లేవు గనుక.. తిప్పి పంపుతున్నట్లు పేర్కొన్నారు.

అయితే ఇవాళ్టి పరిస్థితి వేరు. చంద్రబాబునాయుడు కార్యక్రమానికి అనుమతులు ఉన్నాయి. స్వయంగా తక్కువ మంది నేతలతో కాన్వాయ్ వెళ్లడానికి అనుమతులు ఇచ్చిన పోలీసులే.. అడ్డుకుని తిప్పి పంపడం గమనార్హం. చివరికి ఒక పెళ్లి కార్యక్రమానికి హాజరు కావాలనుకున్న చంద్రబాబు అది కూడా చేయలేకపోయారు. కాకపోతే.. తమ మీద నింద లేకుండా.. చంద్రబాబునాయుడు భద్రత కోసం.. ఆయనను అరెస్టు చేస్తున్నట్లుగా పోలీసులు ఒక లేఖను చేతిరాతతో ఆయనకు ఇవ్వడం విశేషం.

నాటి జగన్ ఘటనతో పోల్చడం కరెక్టేనా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts