వైకాపా ఏం తప్పు చేసిందంటే…

February 27, 2020 at 8:10 pm

విశాఖపట్నంలో చంద్రబాబునాయుడు ప్రజాచైతన్యయాత్ర విషయంలో.. ఆయనను నగరంలోకి అనుమతించకుండా ప్రభుత్వం తప్పు చేసిందా? ఆయనను అరెస్టుచేసి విమానాశ్రయంలోనే నిర్బంధించి ఒక హైడ్రామా సృష్టించడం ద్వారా చంద్రబాబునాయుడుకు ఆయన చేస్తున్న పోరాటానికి మించిన మైలేజీ వచ్చేలా వైకాపా పార్టీనే తోడ్పాటు అందించిందా? అనే ప్రశ్నలు వచ్చినప్పుడు నిస్సందేహంగా ‘అవుననే’ సమాధానమే వస్తోంది. వైకాపా చేజేతులా చంద్రబాబు పోరాటానికి తిరుగులేని ప్రచారం కల్పించింది.

చంద్రబాబునాయుడు ప్రకాశంజిల్లాలో చైతన్య యాత్రలు ప్రారంభించారు. తర్వాత కుప్పం కూడా వెళ్లారు. ఇప్పుడు విశాఖ వచ్చారు. విజయనగరం కూడా ప్లాన్ చేసుకునే వచ్చారు. అయితే ఆయన యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం వైకాపా వారికి ఏం వచ్చిందనేది మాత్రం అర్థం కాని సంగతి. చంద్రబాబు ప్రతిచోటా ఒకే విమర్శలు చేస్తున్నారు. అవేమీ ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేసేంత అస్థిరపరచేంత విమర్శలు కావు. అయినా సరే.. ఇంత రాద్ధాంతం ఎందుకు చేశారో తెలియదు.

నిజానికి చంద్రబాబు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ చైతన్యయాత్ర చేయదలచుకున్నారు. ఇప్పుడిలా అడ్డం పడడం ప్రారంభిస్తే ముందు ముందు ఇంకా ఎన్ని రాద్ధాంతాలు జరుగుతాయి. చంద్రబాబు నోరెత్తితే చాలు.. తమకేదో ముప్పు పొంచి ఉంటుందని ప్రభుత్వం భయపడితే తప్ప.. ఇంతగా అడ్డుకోవడం అనేది అనవసరం.

ఇలా అడ్డుకోవడం ప్రారంభిస్తే అది వైకాపా వారి భయం కిందనే ప్రజలకు కనిపిస్తోంది. చంద్రబాబు వారిలోని భయాన్ని మరింతగా తన మైలేజీకోసం వాడుకుంటాడు. మళ్లీ మళ్లీ మరోచోట ఇలాంటి ప్రయత్నం చేస్తాడు. మళ్లీ రాద్ధాంతం అవుతుంది. ఇలాంటివి నాలుగైదు జరిగే సరికి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది… అణచివేతకు పాల్పడుతోంది. పాపం చంద్రబాబు నాయుడును కనీసం మీటింగులు కూడా పెట్టనివ్వడం లేదు.. అనే సానుభూతి ఆయన సొంతమవుతుంది. అందువల్ల ప్రభుత్వానికేంటి లాభం.

అందుకే విశాఖ ఎపిసోడ్ లో వైకాపా తప్పు చేసిందనే అనిపిస్తోంది. ‘విశాఖలో వైకాపా లెక్కలు తేలుస్తా’ అని పార్టీ నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్న తర్వాతే ఆయన విశాఖకు బయల్దేరారు. ఆయన తేల్చబోయే లెక్కల గురించి.. తమ బాగోతాలు బయటపడతాయని వైకాపా నాయకులు భయపడ్డారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

వైకాపా ఏం తప్పు చేసిందంటే…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts