వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఈ న‌లుగురే…!

February 26, 2020 at 2:59 pm

దేశ‌వ్యాప్తంగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల కోలాహాల మొద‌లైంది. మొత్తం 17 రాష్ట్రాల్లోని 55 రాజ్య‌స‌భ స్థానాలకు మార్చి 26న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే తెలంగాణ‌లో 2, ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు.. వైసీపీ ఖాతాలో పడటం ఖాయం. అటు తెలంగాణ‌లో రెండు సీట్లు కూడా అధికార టీఆర్ఎస్ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే టీడీపీ క‌నీసం పోటీ ఇచ్చే ప‌రిస్థితి కూడా లేక‌పోవ‌డంతో రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు అంద‌రూ ఏక‌గ్రీవంగా ఎన్నిక కానున్నారు.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ శాస‌న‌మండ‌లిని కూడా ర‌ద్దు చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో మండ‌లిపై ఆశ‌లు పెట్టుకున్న నేత‌లు కూడా ఇప్పుడు రాజ్య‌స‌భ సీట్ల వైపే చూస్తున్నారు. ఇక్క‌డ నాలుగు ఖాళీలు ఉంటే అక్క‌డ ఏకంగా 40 మంది వ‌ర‌కు రేసులో ఉన్నారు. ఎవ‌రి ఆశ‌లు ఎలా ఉన్నా జ‌గ‌న్ ఇప్ప‌టికే ఆ న‌లుగురు అభ్య‌ర్థుల పేర్ల‌పై క్లారిటీకి వ‌చ్చేసిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. వైసీపీ నుంచి రాజ్య‌స‌భ‌కు వెళ్లే వారిలో ముందుగా వినిపిస్తోన్న పేరు రాంకీ గ్రూప్ అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి.

ఆయ‌న వైసీపీలో చాలా కాలం నుంచి తెర‌వెన‌క ప‌ని చేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో న‌ర‌సారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు చేతిలో ఓడిపోయారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో సీటు త్యాగం చేశారు.
ఇక ఈయ‌న చేసిన త్యాగం నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు జ‌గ‌న్ కూడా ఎప్పుడో హామీ ఇవ్వ‌డంతో ఈ పేరు తొలిగా ఖ‌రారైంది. ఇక బీసీ కోటాలో నెల్లూరు జిల్లా కావ‌లి మాజీ ఎమ్మెల్యే బీద మ‌స్తాన్‌రావు పేరు వినిపిస్తోంది. మ‌స్తాన్ రావు ఇటీవ‌లే టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఆయ‌న పార్టీ మారే టైంలోనే జ‌గ‌న్ ఆయ‌న‌కు హామీ ఇచ్చిన‌ట్టు టాక్‌..?

ఇక రెడ్డి వ‌ర్గానికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రెండు సీట్లు ఖ‌రారైన‌ట్టే అంటున్నారు. ఈ రెండో సీటును జ‌గ‌న్ బాబాయ్‌, ఒంగోలు మాజీ ఎంపీ వైవి.సుబ్బారెడ్డికి ఇవ్వ‌వ‌చ్చ‌ని టాక్‌. అయితే ఆయ‌న ప్ర‌స్తుతం టీటీడీ చైర్మ‌న్‌గా కూడా ఉన్నారు. సుబ్బారెడ్డికి రాజ్య‌స‌భ బెర్త్ ఖాయం అంటున్నా ఈ సీటు విష‌యంలో జ‌గ‌న్ చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్‌లోనే పెట్ట‌వ‌చ్చంటున్నారు. ఇక మ‌రో సీటు కోసం మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ మధ్య పోటీ ఉంది.

మండ‌లి ర‌ద్దు అయితే వీరిని ఆ రేంజ్ ప‌ద‌వుల్లోనే స‌ర్దుబాటు చేయాలి. పైగా ఇద్ద‌రు బీసీ నేత‌లు అందుక‌నే జ‌గ‌న్ వీరిలో ఒక‌రికి అయినా రాజ్య‌స‌భ సీటు ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట‌. ఏదైమైనా చివ‌ర్లో మార్పులు జ‌రిగితే మిన‌హా ఈ నాలుగు పేర్లు వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులుగా ఖ‌రారైన‌ట్టే..!

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఈ న‌లుగురే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts