ఎస్‌ఈసీపై వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

March 16, 2020 at 4:06 pm

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిన అంశంపై ఇప్ప‌టికే ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. వెంటనే ఎన్నికలు జరిపించాలని పిటిషన్‌లో కోరారు. దీన్ని స్వీకరించిన హైకోర్టు కాసేపట్లో విచారణ చేపట్టనుంది. మరోవైపు… గవర్నర్ విశ్వభూషణ్‌ను కలిసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రమేష్ కుమార్… ఎందుకు ఎన్నికల్ని వాయిదా వేసిందీ వివరించారు. ప్రజలు, మీడియాకు ఈ విషయంపై సమాచారం ఇవ్వాలనుకుంటే… దీనిపై ప్రెస్ నోట్ విడుదల చేస్తామన్నారు. ఐతే… ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించలేదని గవర్నర్ 45 నిమిషాలు జరిగిన భేటీలో అడిగినట్లు తెలిసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా ఉందనీ, అలాగే… కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతుంటే… నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు రాలేని పరిస్థితులు ఉండటం వల్లే ఎన్నికల్ని వాయిదా వేసినట్లు రమేష్ కుమార్ చెప్పినట్లు స‌మాచారం.

తాజాగా ఈ అంశంపై ప‌లాస వైసీపీ ఎమ్మ‌ల్యే అప్ప‌ల‌రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎస్ఈసీ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. చంద్ర‌బాబుతో క‌లిసి ఆయ‌న లోపాయికారిగా ఒప్పందం చేసుకున్న నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల‌ను వాయిదా వేశార‌ని విరుచుకుప‌డ్డారు. ఎన్నిక‌ల‌ను వాయిదా వేసేముందుకు క‌నీసం రాష్ర్ట ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌లేద‌ని, ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకున్నారని మండిప‌డ్డారు. ర‌మేశ్‌కుమార్ కుమార్తె గ‌తంలో ఎక‌నామిక్ డెవ‌లప్‌మెంట్ ఫోరంలో ప‌నిచేశార‌, బాబుకు, ఎస్ ఈసీ కి స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని, ఈ నేప‌త్యంలో ఇద్ద‌రూ కూడ‌బ‌లుక్కుని ఎన్నిక‌ల వాయిదా నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. క‌రోనా వైర‌స్ విజృభింస్తున్న‌ద‌ని చెబుతున్న ర‌మేశ్‌బాబు ఆ విష‌యంలో ఎవ‌రిని సంప్ర‌దించి నిర్ణ‌యం తీసుకున్నార‌ని? క‌నీసం రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ‌ను సంప్ర‌దించలేద‌ని ఆయ‌న తెలిపారు.

ఎస్‌ఈసీపై వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts