తాగుబోతుల సైకాలజీ స్టడీ చేశారన్నమాట!

March 7, 2020 at 12:09 pm

జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకువస్తానని ఇదివరకే ప్రకటించారు. అందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఆ రకంగా.. మహిళల అభిమానాన్ని కూడా చూరగొంటున్నారు. అయితే రాష్ట్ర మద్యవిమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ వి.లక్ష్మణ రెడ్డి మాత్రం మద్యపాన నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ.. తమాషా కబుర్లు చెబుతున్నారు. నకిలీ బ్రాండ్లు, మార్కెట్లో ఊరూపేరూ లేని బ్రాండ్ల మద్యాన్ని విక్రయిస్తున్నారనే ఆరోపణలకు జవాబుగా.. తమ చర్యలను సమర్థించుకుంటున్నారు.

జగన్మోహన రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత.. మద్యంపై ఉక్కుపాదం మోపుతోంది. మొదటి దెబ్బగా మద్యం షాపులను భారీగా తగ్గించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం విక్రయాలు చేపడుతున్నారు. రెండోది- మద్యం ధరలను భారీగా పెంచారు. ధర బాగా పెంచడం వలన ప్రభుత్వ ఆదాయంలో పెద్దగా తేడా రావడమూ.. తద్వారా వచ్చే ఆర్థిక వనరులు దెబ్బతినడమూ జరగకుండా.. విక్రయాలు తగ్గినప్పటికీ.. ఆదాయం ఇంచుమించు సమంగానే ఉంటోంది.

సాధారణంగా ప్రజలకు ఏమాత్రం తెలియని బ్రాండ్ల మద్యం కూడా ఏపీలో విక్రయం అవుతోంది. ఈ విషయంపై ఇటీవల తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేసింది. ఆ పార్టీ నాయకుడు.. అన్ని రకాల బ్రాండ్ల మద్యాన్ని తలా ఒక సీసా టేబుల్ మీద ప్రదర్శనకు ఉంచి.. ఇవన్నీ నకిలీ బ్రాండ్లు అని.. ఎవ్వరికీ ఊరూ పేరూ తెలియని బ్రాండ్ల మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారని విమర్శించారు.

అయితే దీనికి ఇప్పుడు మద్యపాన విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ లక్ష్మణరెడ్డి వివరణ ఇచ్చుకుంటున్నారు. ఆయన చాలా గొప్ప పాయింటే చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం.. మద్యపానానికి అలవాటు పడిన వారికి.. వారు తాగే బ్రాండ్ అందుబాటులో లేకపోతే గనుక.. మానేస్తారని.. అందుకే ప్రజలతో మద్యపానం అలవాటును మాన్పించడానికే.. పాపులర్ బ్రాండ్ల మద్యాన్ని తక్కువగా అందుబాటులో ఉంచి, ఊరూపేరూ లేని బ్రాండ్లను ఎక్కువగా అందుబాటులో ఉంచుతున్నట్లుగా ఆయన వివరిస్తున్నారు. ఇదేదో డొంకతిరుగుడు సమర్థన లాగా ఉంది.

సాధారణంగా తాగుబోతులు సమయానికి దొరక్కపోతే.. ఏ చెత్త ఆల్కహాలైనా తాగేస్తుంటారనేది ప్రజల అనుభవం. కానీ ఈయన ఇలా వివరణ ఇస్తున్నారు. చూడబోతే.. పాపులర్ బ్రాండ్లకు గండికొట్టి.. తాగుబోతులంతా.. తాము అమ్మే చీప్ బ్రాండ్లకే అలవాటు అయ్యేలా వారు ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

తాగుబోతుల సైకాలజీ స్టడీ చేశారన్నమాట!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts