బాల‌లుగా వెలుగులు.. ఇప్పుడేమో ఫ్లాపులు..!

March 17, 2020 at 7:34 am

తెలుగు చిత్ర‌సీమ‌లో అనేక మంది బాలన‌టులున్నారు. వారిలో కొంద‌రు త‌మ అభిన‌యంతో అంద‌రినీ అబ్బుర‌ప‌రిచారు. న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆపై యుక్త‌వ‌య‌స్సుకు రాగానే హీరోలుగా, హీరోయిన్లుగా అడుగుపెట్టి సంచ‌ల‌నాన్ని క్రియేట్ చేశారు. అపురూప విజ‌యాల‌ను అందుకుని ఎన్నో విజ‌యాల‌ను అందుకున్నారు. త‌మ‌కంటూ ప్ర‌త్యేకంగా అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఎన్నో అవార్డుల‌ను అందుకున్నారు. తెలుగు సినిమా కీర్తిని న‌లుదిశ‌లా చాటారు. అలాంటి బాల‌న‌టుల్లో క‌మ‌ల్‌హాస‌న్‌, మీన‌, శ్రీ‌దేవి, రాశి, అలీ వంటి ఇంకా ఎంద‌రో ప్ర‌ముఖులున్నారు. కానీ ప్ర‌స్తుతం అలా బాల‌న‌టులుగా మెరుపులు చూపి తిరిగి అదే స్థాయిలో స‌త్తా చాటుతున్న‌వారు ఎవ‌రైనా ఉన్నారా? అంటే లేద‌నేది స‌మాధానం. ఎంతో మంది బాల‌న‌టులుగా వెండితెర‌పై వెలుగు వెలిగారు. ఇప్పుడు మాత్రం ప్లాఫుల‌ను అందుకుంటున్నారు. కొంద‌ర‌యితే ఇక తెర‌మ‌రుగయి పోవ‌డం గ‌మ‌నార్హం. వారిలో కొంద‌రి గురించి చ‌ర్చించుకుందాం.

బాల న‌టుల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే త‌రుణ్‌. అల‌నాటి తార రోజార‌మ‌ణి కుమారుడు. ఎన్నో చిత్రాల్లో బాల‌న‌టుడిగా ప్ర‌తిభ చూపాడు. ఆదిత్య 369 సినిమాతోనైతే మ‌రీ పాపుల‌ర్ అయిపోయాడు. అటు త‌రువాత నువ్వేకావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి భారీ విజ‌యాన్ని అందుకున్నాడు. ప్రియ‌మైన నీకు, నువే నువ్వే, నువ్వులేక నేను లేను త‌దిత‌ర సినిమాలు చేసి విజ‌య ప‌రంప‌ర‌ను కొన‌సాగించాడు. అంతే అటుత‌రువాత వ‌రుస‌గా ఫ్లాపులే. ఏ ఒక్క‌టీ కూడా ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. దీంతో ఇప్పుడు ఈ స్టారు సినిమాల నుంచే త‌ప్పుకున్నాడు. బిజినెస్ రూట్లో దిగిపోయాడు. ఇక మ‌రొక ప్ర‌ముఖ బాల న‌టుడు బాలాదిత్య‌. లిటిల్ సోల్జ‌ర్స్‌, అన్న‌, ఎదురింటి మొగుడు ప‌క్కింటి పెళ్లాం త‌దిత‌ర సినిమాల‌తో పేరు తెచ్చుకున్నాడు. అగ్ర‌హీరోలతో పోటీప‌డి మ‌రీ రాణించాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం అంత ఆశించిన స్థాయిలో ఏమీ లేదు. చంటిగాడు, సుంద‌రం సినిమాలు ఫ‌ర్వాలేద‌నిపించినా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క భారీ విజ‌యాన్ని కూడా అందుకోలేదు. దీంతో దాదాపు ఐదేళ్లుగా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు దూరంగా ఉండిపోయాడు. తిరిగి తాజాగా ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు సినిమాతో మ‌ళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు.

అదేవిధంగా త‌నిష్ కూడా మ‌న్మ‌థుడు, ఏవండోయ్ శ్రీ‌వారు త‌దిత‌ర సినిమాల‌తో బాల‌న‌టుడిగా పేరు తెచ్చుకున్నాడు. అటు త‌రువాత హీరోగా చేసిన బ‌స్టాప్ సినిమా మంచి విజ‌యాన్ని మాత్ర‌మే సాధించింది. అంతే మ‌రో విజ‌యాన్ని అందుకోలేదు. దీంతో విల‌న్ పాత్ర‌ల‌ను కూడా ప్ర‌య‌త్నించాడు ఈ యువ హీరో. అయినా ఫేట్ మార‌లేదు. దీంతో కొంత కాలంగా సినిమా అవ‌కాశాలేవీ లేకుండా పోయాయి. ఇక సిసింద్రీ సినిమాతో చిరునవ్వులు పూయించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సును దోచుకున్న అఖిల్ అక్కినేని ప‌రిస్థితి అయితే మ‌రీ దారుణం. ఆయ‌న న‌టించిన ఒక్క సినిమా కూడా ఇప్ప‌టికీ విజ‌యాన్ని సాధించ‌లేదు. మ‌రో బాల న‌టుడు మంచు మ‌నోజ్‌. ఈయ‌న త‌న తండ్రి న‌టించి నిర్మించిన పుణ్య‌భూమి నాదేశం సినిమాలో క‌నిపించాడు. అటు త‌రువాత సెకండ్ ఇన్నింగ్స్‌లో హీరోగా ప్ర‌యాణం మొద‌లు పెట్టినా అది ఒడిదొడుకుల‌ను ఎదుర్కొంటూనే సాగుతున్న‌ది. ఒక సినిమా విజ‌యం సాధిస్తే ప‌ది ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రిస్తున్నాయి. ఇక పూరి జ‌గ‌న్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి, నందా, భ‌ర‌త్ ఇలా ఎంద‌రో బాల‌న‌టులుగా మెరిపించినా హీరోలుగా మాత్రం రాణించ‌లేక‌పోతున్నారు. విజ‌యాల‌ను చ‌విచూడ‌లేక తెర నుంచి త‌ప్పుకుంటున్నారు.

అదే విధంగా హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే కూడా అదే ప‌రిస్థితి. బాల‌న‌టులుగా మెరిసిన కొంద‌రు అటు త‌రువాత తార‌లుగా ఎంట్రీ ఇచ్చినా అదృష్టం త‌లుపుత‌ట్ట‌క‌పోవ‌డంతో వెనుతిరిగిపోతున్నారు. వారిలో బేబీ సుహానీ ఒక‌రు. మ‌న‌సంతానువ్వే, ఎలా చెప్ప‌ను? సినిమాలో న‌టించి అంద‌రి మ‌న‌సుల‌ను దోచుకుంది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టినా ఏ మాత్రం నిల‌దొక్కుకోలేక‌పోయింది. ఇక అవికా గౌర్‌. చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్‌తో సుప‌రిచ‌త‌మైన ఈ భామ అటు త‌రువాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. కానీ చేసిన మొదుటి రెండు సినిమాలు మిన‌హా మ‌రే సినిమాతోనూ ఆక‌ట్టుకోలేక‌పోయింది. అలాగే శ్వేతాబ‌సు ప్ర‌సాద్ బాల‌న‌టిగా చెప్పుకోద‌గ్గ సినిమాలు చేసిన ఈ భామ‌, అటు త‌రువాత కొత్త‌బంగారులోకం సినిమాతో కుర్ర‌కారు మ‌న‌సుల‌ను కొల్ల‌గొట్టింది. అటు త‌రువాత చేసిన సినిమాల‌న్నీ ప‌రాజ‌యం పాల‌య్యాయి. ఇక అదేనంటే ఈ భామ వ్య‌భిచారం చేస్తూ రెడ్ హ్యండెడ్‌గా ప‌ట్టుబ‌డ‌డం కొస‌మెరుపు. ఇలా చెప్పుకుంటే మ‌రెంద‌రో బాల‌న‌టులున్నారు. పిల్ల‌లుగా పిడుగులు అనిపించుకున్నా, అటుత‌రువాత క‌థ‌నాయ‌కులుగా, క‌థానాయిక‌లుగా మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ మ‌రొక విష‌యాన్ని కూడా చెప్పుకోవాలి. ఏమిటంటే.. వీరిలోని బాల‌న‌టులు తండ్రుల వార‌స‌త్వం ఉన్న వారు మాత్ర‌మే ఫ్లాపులు వ‌చ్చినా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఎలాంటి వార‌స‌త్వం లేని వారు మాత్రం తెర‌మ‌రుగ‌యిపోతున్నారు.

బాల‌లుగా వెలుగులు.. ఇప్పుడేమో ఫ్లాపులు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts